TRS Vs BJP :  తెలంగాణలో టీఆర్ఎస్ , భారతీయ జనతా పార్టీల  రాజకీయం అవినీతి చుట్టూ తిరుగుతోంది. మీ దోపిడి గురించి బయటపెడతామంటే.. మీ దోపిడి గురించి బయటపెడతామంటూ రెండు పార్టీలు సవాళ్లు చేసుకుంటున్నాయి.  టీఆర్ఎస్ అవినీతి చిట్టా మొత్తం తమ చేతుల్లో ఉందని బీజేపీ నేతలు చాలా కాలంగా చెబుతున్నారు. కేసీఆర్‌ను జైలుకు పంపడం ఖాయమనేనంటున్నారు. అయితే ఇప్పటి వరకూ ఏమీ చేయలేదు. కనీసం చిన్న విచారణ జరగలేదు. కేసీఆర్ కూడా అంతే. కేంద్రం అవినీతి చిట్టా మొత్తం తమ దగ్గర ఉందని అంటున్నారు. లెక్కలన్నీ బయట పెడతామని కేసీఆర్ కూడా నేరుగా హెచ్చరిస్తున్నారు. మోదీ జాత‌కం అంతా ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో రెడీ గా ఉంది, ఎవ‌రెవ‌రికి ఎంత దోచిపెట్టారో చిట్టా అంతా ఉంద‌ని చెబుతున్నారు. ఈ రెండు పార్టీల అవినీతి  ఆరోపణలతో రాజకీయం మరింత వేడెక్కుతుంది. ముందుగా ఎవరు ఎవరి అవినీతిని బయటపెడతారన్నది చర్చనీయాంశంగా మారింది. 


ఆర్టీఐ దరఖాస్తులు చేసి ఇక గుట్టు రట్టేనంటున్న తెలంగాణ బీజేపీ ! 
   
కేసీఆర్ ప్రభుత్వంపై సమాచార హక్కు చట్టాన్ని అస్త్రంగా బండి సంజయ్ ప్రయోగించారు. సమాచారం కోరుతూ ఆర్టీఐని ఆశ్రయించారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఆర్టీఐకి 88 దరఖాస్తులు చేశారు. అందులో వంద ప్రశ్నలు సంధించారు. ప్రగతి భవన్ నిర్మాణం మొదలు ప్రభుత్వ ప్రకటనల వరకు అన్ని శాఖల నుంచి సమాచారం కోరుతూ దరఖాస్తు చేశారు. వైద్య, విద్యాశాఖలకు సంబంధించి సమచారం కూడా కోరారు. కేసీఆర్ ఎన్నిసార్లు సచివాలయానికి వచ్చారు? ఇప్పటివరకు ఎన్ని హామీలు నెరవేర్చారు? ప్రగతిభవన్‌ నిర్మాణానికి ఖర్చు ఎంత? ఎన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశారు? ఎన్ని భర్తీ చేశారు? ఇలా  అనేక ప్రశ్నలని బండి ఆర్టీఐకి సంధించారు. అలాగే ఇంకా పలు అంశాల గురించి తెలుసుకునేందుకు ఆర్టీఐ కింద వివరాలు ఇవ్వాలని కోరుతూ ముఖ్య నేతలు సైతం దరఖాస్తులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమాచారాలని ఎలాగైనా తెలుసుకుని కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ ప్రగతి భవన్ కంటే ఫార్మ్ హౌస్ లోనే ఎక్కువ సమయం గడుపుతారని, ప్రజలను పట్టించుకోరని చెప్పడమే బీజేపీ ధ్యేయంగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ వారంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటారని నిరూపించే ప్రయత్నంలో కమలనాథులు ఉన్నారు. 


తాము ఇరుకున పడే సమాచారం అయితే ప్రభుత్వం ఇస్తుందా ?


బండి సంజయ్ .. కేసీఆర్ అవినీతి చిట్టా తమ దగ్గర ఉందని చాలా కాలం నుంచి చెబుతున్నారు. దాన్ని బయట పెట్టకుండా ఇప్పుడు  ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేశామని హడావుడి చేస్తున్నారు. నిజానికి ఆర్టీఐ చట్టం దరఖాస్తులకు సమాచారం ఇవ్వాల్సింది ప్రభుత్వమే.  తమకు ఇబ్బందిగా ఉన్న సమాచారం ప్రభుత్వం ఇవ్వదు. ఆ విషయం తెలియడానికి రాజకీయ పండితులు అవ్వాల్సిన అవసరం లేదు. అయినా బీజేపీ నేతలు మాత్రం ఐర్టీఐ దరఖాస్తుల పేరుతో ఇంకా హడావుడి చేస్తున్నారు. ఎలాంటి సమాచారం రాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకూ బీజేపీ ఇతర మార్గాల ద్వారా సమచారాన్నిసేకరించి ఉంటే దాన్నే బయట పెట్టాలి . కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ. ఆ పార్టీ తల్చుకుంటే తెలంగాణలో జరిగిందని చెబుతున్న అవినీతిపై పూర్తి స్థాయి సమాచారం సంపాదించుకోవడం ఈజీనే.


బీజేపీ అవినీతి చిట్టా అంతా తమ దగ్గర ఉందంటున్న కేసీఆర్ ! 
  


బీజేపీ అవినీతి చిట్టామొత్తం తమ దగ్గర ఉందని కేసీఆర్ ప్రకటించారు.  బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని అవినీతిని కూడా బయటపెట్టాలని భావిస్తోంది. మోదీని షావుకార్ల సేల్స్‌మెన్‌గా చెబుతూ.. ఎంతెంత అవినీతికి పాల్పడ్డారో వివరించేందుకు సిద్ధమయింది. అయితే టీఆర్ఎస్ కూడా ప్రకటనలే చేస్తోంది. రెండు పార్టీలు  ఈ విషయంలో అడుగు కూడా మందుకు వేయడం లేదు.  అధికారంలో ఉన్న పార్టీలపై ప్రధానంగా వచ్చే ఆరోపణ అవినీతి. ఇప్పుడు కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఒకరిపై ఒకరు పోరాడుతూ ఈ అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాజకీయం మాత్రం జోరుగా చేసుకుంటున్నారు. ఎవరి అవినీతి ముందుగా బయటకు వస్తుందో అంచనా వేయడం కష్టమే.