ATM Robbery In Ananthapuram: అర్ధరాత్రి గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను పగలగొట్టిన దుండగులు అక్కడ అలారం సిస్టమ్ పని చేసే లోపే రూ.30 లక్షలు దోచేశారు. ఈ ఘటన అనంతపురంలోని (Ananthapuram) రామ్ నగర్ సమీపంలో జరిగింది. పట్టణంలోని ఏటీఎంను శనివారం అర్ధరాత్రి దుండగులు గ్యాస్ కట్టర్లతో పగలగొట్టి రూ.30 లక్షలు దోచేశారు. అక్కడ అలారం సిస్టం పని చేసి పోలీసులు అక్కడికి చేరుకునే లోపే డబ్బుతో ఉడాయించారు. ఆదివారం ఉదయం ఏటీఎంలో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. అక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


కడపలోనూ..


మరోవైపు, కడపలోని ప్రకాష్ నగర్‌లోనూ శనివారం సాయంత్రం చోరీ జరిగింది. స్థానికంగా నివాసం ఉండే వరలక్ష్మి అనే మహిళ భర్త కొద్దిరోజుల క్రితం మరణించాడు. ఈ క్రమంలో వివిధ కార్యక్రమాల కోసం కుటుంబ సభ్యులు స్వగ్రామమైన చెన్నూరుకు వెళ్లి.. తిరిగి శనివారం ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉండడం చూశారు. ఇంట్లోని బీరువా పగలగొట్టి వస్తువులన్నీ చిందవందరగా పడి ఉన్నాయి. దాదాపు రూ.4.50 లక్షల నగదు, 10 తులాల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


తెలంగాణలోని వైన్ షాపులో..


అటు, తెలంగాణలోని వైన్ షాపులోని శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని రేణుక వైన్స్‌లో అర్ధరాత్రి దొంగలు షాపు షట్టర్ తాళాలను పగలగొట్టి చోరికి పాల్పడ్డారు. కౌంటర్‌లోని రూ.50 వేల నగదు, కొన్ని మద్యం బాటిళ్లను చోరీ చేశారు. ఆదివారం ఉదయం షాపు యజమాని వచ్చి చూడగా చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గత కొన్ని రోజుల క్రితమే ఇచ్చోడకు సమీపంలోని గిర్నూర్ వైన్స్‌లోను చోరీ జరిగిందని.. ఇప్పుడు మరో ఘటన చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.


Also Read: Fire Accident: విశాఖ రైల్వే స్టేషన్ లో ఘోర అగ్నిప్రమాదం, కోర్బ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ ఏసీ బోగీల్లో భారీ మంటలు