Road Accident : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి, తలుపుల మండలం బట్రేపల్లి సమీపంలోని రెక్క మాను వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  పులివెందుల నుంచి కదిరి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు, కదిరి నుంచి గండిమడుగు వెళ్తోన్న ఇన్నోవా ఢీకొని ఇద్దరు బాలికలు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో  వారిని బెంగళూరుకి తరలించారు. స్వల్పంగా గాయాలైన ముగ్గురిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే కదిరి 24వ వార్డుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఇన్నోవాలో గండిమడుగుకు విహార యాత్రకు వెళ్తుండగా తలుపుల మండలం బట్రేపల్లి సమీపంలోని రెక్క మాను క్రాస్ వద్ద పులివెందుల నుంచి కదిరికి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో తబస్సుమ్(10), సల్మా(16) మృతి చెందారు. సఫా (16), అహ్మద్( 16), మహమ్మద్ హుస్సేన్( 11) తీవ్ర గాయాలు కావడంతో బెంగళూరులోని ఆసుపత్రికి తరలించారు. హబీబ్, హజీరా, సుమియా స్వల్పంగా గాయాలు కావడంతో కదిరిలో చికిత్స పొందుతున్నారు.
 
వాహనంపై విరిగిపడ్డ చెట్టు, ఇద్దరు మృతి 


నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా వైపు వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనంపై హఠాత్తుగా భారీ వృక్షం పడడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో క్షతగాత్రుడ్ని ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన యువకులు ఆదిలాబాద్ జిల్లా కుంటాల జలపాతానికి వెళ్తుండగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఎగ్బాల్ పూర్ గ్రామ సమీపంలోని నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిలో వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనంపై హఠాత్తుగా భారీ వృక్షం విరిగిపడింది.  టాటా మ్యాజిక్ వాహనంలో ప్రయాణిస్తున్న భుచ్చన్న, రవి అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఇందులో నిఖిల్ అనే మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడ్ని ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి నిజామాబాద్ తరలించారు. టాటా మ్యాజిక్ వాహనంలో ప్రయాణిస్తున్న మరికొందరికి సైతం స్వల్పంగా గాయాలయ్యాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటన స్థలానికి ఖానాపూర్ సీఐ అజయ్ బాబు, ఎస్సై రజినీకాంత్ , పోలీస్ సిబ్బందితో చేరుకొని జేసీపీ సహాయంతో చెట్టును తొలగించి వాహనాన్ని బయటకు తీశారు.  


వాగులో కొట్టుకుపోయిన కారు  


వేములవాడలో ఘోరం జరిగింది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు ఇద్దరి ప్రాణాలను బలిగొంది. జగిత్యాల జిల్లా చల్ గల్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం హైదరాబాద్ వెళ్తుండగా  వేములవాడ రూరల్ ఫాసుల్ నగర్ వద్ద బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న వాగును దాటుతుండగా ప్రమాదం జరిగింది. కారు వరద నీటిలో కొట్టుకుపోయింది. రిజ్వాన్( డ్రైవర్), నరేష్ అనే వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే నీటి ఉద్ధృతి అధికంగా ఉండడంతో జేసీబీ సహాయంతో కారును బయటకు తీసిన పోలీసులు అందులో చిక్కుకున్న గంగ (బుద్ది) అనే మహిళ (47) మనువడు కిట్టు (2) మృత దేహాలను వెలికితీశారు


Also Read : East Godavari Crime : భూమి కోసం ఊరికొస్తే, సెప్టిక్ ట్యాంకులో పూడ్చిపెట్టారు-కాకినాడ జిల్లాలో దారుణం!


Also Read : Hyderabad Crime : హైదరాబాద్ లో యువతి మిస్సింగ్ విషాదాంతం,పెళ్లికి నిరాకరించిందని ప్రియుడే ఘాతుకం