సామాన్యుడు రాత్రీపగలు కష్టపడి కట్టుకున్న డబ్బును మాయ చేసి అప్పనంగా కొట్టేసి పెద్దమనిషి ముసుగులో తిరుగుతున్న రియల్టర్‌ను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రీలాంచ్ పేరుతో ప్రాజెక్టులను ఓపెన్ చేసి కోట్లు పోగేసి బోర్డు తిప్పేసే బూదాటి లక్ష్మీనారాయణను హైదరాబాద్‌ సీసీఎసస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ప్రీలాంచ్ ప్రాజెక్టుల పేరుతో 2500 మంది నుంచి 900 కోట్లు వసూలు చేసినట్టు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై విచారణ జరరిపిన అధికారులు మోసాలు నిజమని తేల్చారు. అందుకే ఆయన్ని అరెస్టు చేశారు. 


2019లో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో సాహితీ శరవణి ఎలైట్‌ పేరుతో ప్రాజెక్టు ప్రారంభించారు. 23 ఎకరాల్లో 38 అంతస్తులతో పది అపార్టుమెంట్లు నిర్మిస్తున్నామని ప్రకటనల్లో తెలిపారు. డబుల్, ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ల ఫ్లాట్లు ఉంటాయని నమ్మబలికారు. మంచి ఎమినిటీస్‌తో తక్కువ ధరకే ఇస్తామని అందర్నీ ఆకర్షించారు. ఈ ప్రకటనలకు ఆకర్షితులైన 1700 మంది పెట్టుబడి పెట్టారు. వాళ్లంతా 539 కోట్ల రూపాయలు సాహితీ ఇన్‌ఫ్రాకు అందజేశారు. 


నెలలలు కాదు సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో కస్టమర్స్‌ సాహితీ శరవణి ఎలైట్‌పై ఆరా తీశారు. అసలు ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని ఆలస్యంగా తెలిసింది. అంతే వాళ్లంతా మోసపోతున్నామని గ్రహించి బుకింగ్‌లు రద్దు చేసుకోవడం స్టార్ట్ చేశారు. డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. 


వాళ్లను శాంతిపజేయడానికి వడ్డీ పేరుతో మరో మోసానికి తెరశారు బూదాటి లక్ష్మీనారాయణ. ఏడాదికి 15 నుంచి 18 శాతం వడ్డీ ఇస్తానంటూ నమ్మబలికారు. అందరికీ నమ్మకం కలిగించేందుకు కొందరికి చెక్స్‌ కూడా ఇచ్చారు. వడ్డీ వస్తుంది కదా అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ చెక్స్‌ను బ్యాంకులో వేస్తే బౌన్స్ అయ్యాయి. దీంతో పూర్తి తామంతా మోసపోయామని గ్రహించి లబోదిబోమని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. 


కేసు రిజిస్టర్ చేసుకొని విచారించిన పోలీసులుకు విస్తుపోయే వాస్తవాలు తెలిసాయి. ఒక్క అమీన్‌పూర్‌లోనే కాదు మరిన్ని ప్రాంతాల్లో మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రగతినగర్‌, బొంగుళూరు, కాకతీయ హిల్స్‌, అయ్యప్ప సొసైటీ, కొంపల్లి, శామీర్‌పేట్‌లో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడ్డారు. ఇలా 2,500 మంది నుంచి 900 కోట్లు వసూలు చేశారు.


హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ పేరుతో మోసాలకు పాల్పడ్డ లక్ష్మీనారాయణ... ఆ సొమ్మునంతా అమరావతిలో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఇలా వచ్చిన డబ్బులను వివిధ ప్రాజెక్టులకు మళ్లించి... అవసరాలకు వాడుకొని బాధితులను నిలువునా ముంచారు. ఆయన ప్రారంభించిన ప్రాజెక్టుల్లో వేటికి కూడా అనుమతులు లేవని పోలీసులు గుర్తించారు.  


పోలీసులు అరెస్టు చేసిన తర్వాత బూదాటి లక్ష్మీనారాయణ టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. నైతిక బాధ్యతతో ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్టుు ప్రకటించారుు. 2021 సెప్టెంబరులో టీటీడీ బోర్డు సభ్యుడిగా ప్రమాణం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతానికి చెందిన ఆయన హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఈయన నియామకం సమయంలోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని తెలుస్తోంది.