ఆంధ్రప్రదేశ్‌లో వాయుగండం పొంచి ఉంది. ఐదో తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నట్టు తెలిపింది. ఈ అల్పపీడనం కారణంగా 
మరికొద్ది రోజుల్లో స్వల్ప వర్ష సూచన అవకాశాలు కనిపిస్తున్నట్లుగా వాతావరణ అధికారులు అంచనా వేశారు. 


బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌ తీరంలో 4వ తేదీన తుపాను ఆవర్తనం ఏర్పడుతుందని, 5న ఇది అల్పపీడనంగా మారుతుందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇది మరింత బలం పుంజుకుని వాయుగుండంగా మారుతుందని చెప్పారు. 8న తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే ఉత్తర భారతం మీదుగా వీస్తున్న చలిగాలులు తగ్గుతాయని చెప్పారు.






ఈ సీజన్‌లోని బలమైన తుపాను డిసెంబర్ రెండో వారంలో బంగాళాఖాతంలో ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. అది బలహీనపడుతుందా? లేక బలపడుతుందా? అన్నది ఇప్పుడే చెప్పలేమంటున్నారు అధికారులు. ఆ తుపానుతో ఎంత ముప్పు ఉంటుందనే విషయంపై ఇంకా విశ్లేషణలు చేస్తున్నట్టు వివరించారు. 


ఈ వాతావరణ పరిస్థితుల నడుమ దక్షిణ కోస్తాలో డిసెంబరు ఆరు, ఏడు తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నెల్లూరు, తిరుపతి, రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు.


దక్షిణాంధ్రకు వర్ష సూచన - ఏపీ వెదర్ మ్యాన్
‘‘కోనసీమ జిల్లా, ఉభయగోదావరి, క్రిష్ణా, గుంటూరు జిల్లాలో కొన్ని భాగాలు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇవాళ రేపు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఈసారి భారీ వర్షాలు ఉండే అవకాశం లేదు. తమిళనాడుకు అధిక వర్షాలు ఉండే అవకాశం ఉంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.


తెలంగాణ వాతావరణం ఇలా..
తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు ఎక్కడా వర్షాలు పడే సూచనలు లేవని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వాతావరణం పొడిగానే ఉంటుందని తెలిపారు. కానీ, చలి తీవ్రత సాధారణంగానే ఉంటుందని అంచనా వేశారు.


హైదరాబాద్‌లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగమంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29.7డిగ్రీలు, 18.4 డిగ్రీల సెంటీగ్రేడ్ గా ఉండే అవకాశం ఉంది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు.. గాలివేగం గంటకు 4 కిలో మీటర్ల నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. నిన్న నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 32 డిగ్రీలు, కనిష్ఠంగా 16.6 డిగ్రీల సెంటీగ్రేడ్ గా నమోదైంది.


వివిధ చోట్ల చలి ఇలా..
నిన్న తెలంగాణలోని వివిధ చోట్ల నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో విపరీతమైన చలి ఉంటోందని తెలిపారు. ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, వరంగల్ జిల్లాల్లోనూ కనిష్ణ ఉష్ణోగ్రత 11 నుంచి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య నమోదవుతోంది. ఈ జిల్లాలకు పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు. 


నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో కనిష్ణ ఉష్ణో్గ్రతలు 15 డిగ్రీలకు మించి నమోదవుతుండడంతో ఇక్కడ ఎలాంటి అలర్ట్ లు జారీ చేయలేదు.