రాజస్థాన్‌లో సభ్య సమాజం తలదించుకునే షాకింగ్ ఘటన జరిగింది. కొంతమంది దుండగులు ఓ దళిత యువకుడ్ని కిడ్నాప్ చేసి చితకబాది అతడితో మూత్రం తాగించారు. దేశ గణతంత్ర దినోత్సం రోజునే ఈ ఘటన జరిగింది. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎనిమిది మంది నిందితుల్లో ఇద్దర్ని అరెస్ట్ చేశారు.


ఏం జరిగింది?


జనవరి 26న రాత్రి ఓ వ్యక్తి బాధితుడి ఇంటికి వెళ్లి తనతో పాటు రావాలని కొంచెం పని ఉందని కోరాడు. అయితే అందుకు బాధితుడు నిరాకరించగా అతడ్ని కిడ్నాప్ చేసి కారులో దగ్గరలోని పొలాల వద్దకు లాక్కెళ్లారు. ఆ తర్వాత అకారణంగా కులం పేరుతో దూషిస్తూ బాధితుడ్ని నిందితులు చితకబాదారు. ఆ తర్వాత బలవంతంగా తనతో మూత్రం తాగించారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.


అయితే గత ఏడాది జరిగిన హోలీ సంబరాల్లో సదరు బాధితుడికి నిందితులకు గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు.


8 మందిలో..


ఈ ఘటనలో మొత్తం 8 మంది పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఇందులో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అరెస్ట్ అయిన ఇద్దరు ఉమేశ్ జాట్, బీర్బల్ జాట్‌ అని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. త్వరలోనే మిగిలిన నిందితులను పట్టుకుంటామన్నారు. అరెస్ట్ చేసిన ఇద్దర్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనకు కారణమేంటనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వివరాలు ప్రకటిస్తామన్నారు.


ఈ ఘటనపై దళిత సంఘాలు మండిపడ్డాయి. వెంటనే నిందితులు అందర్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. స్వతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడుస్తోన్న ఇంకా దళితులపై దాడులు జరగడం అమానుషమని విపక్షాలు పేర్కొన్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకున్ననాడే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని విపక్ష నేతలు అన్నారు.



Also Read: NeoCoV Variant: నో టెన్షన్.. 'నియోకొవ్'కు అంతలేదట..! చైనా శాస్త్రవేత్తలే కాస్త మసాలా జోడించారట!


Also Read: Goa Poll 2022: 'రాహుల్ గాంధీకి 'మోదీ ఫోబియా' పట్టుకుంది.. గోల్డెన్ గోవా మాకే సాధ్యం'