గోవాలో స్థిరమైన అభివృద్ధి భాజపాతోనే సాధ్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ కుటుంబానికి గోవా కేవలం 'వెకేషన్ స్పాట్' మాత్రమేనని ఎద్దేవా చేశారు.
గోవా ప్రజలు.. 'గోల్డెన్ గోవా' కావాలో 'గాంధీ పరివార్ కా గోవా కావాలో' తేల్చుకోవాలి. కాంగ్రెస్, గాంధీ కుటుంబం.. గోవాను ఓ పర్యటక ప్రదేశంగా మాత్రమే చూస్తోంది. అందుకే అప్పుడప్పుడు వాళ్లు ఇక్కడకు వస్తుంటారు. కానీ భాజపా మాత్రం.. దివంగత మనోహర్ పారికర్.. కలలు కన్న 'గోల్డెన్ గోవా' కోసమే పనిచేస్తోంది. - అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
ఆయనకు మోదీ ఫోబియా..
మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కూడా అమిత్ షా విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ.. మోదీ ఫోబియాతో బాధపడుతున్నారని షా అన్నారు. అలానే గోవా ఎన్నికల్లో పోటీ చేస్తోన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ), ఆమ్‌ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్‌పైనా సెటైర్లు వేశారు.
గోవా ఎన్నికల్లో పోటీ చేస్తోన్న ఎన్‌సీపీ, ఆమ్‌ఆద్మీ, టీఎంసీ పార్టీలు ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు. కేవలం గుర్తింపు కోసమే ఇక్కడ పోటీ చేస్తున్నాయి. భాజపా మాత్రమే ఇక్కడ సర్కార్ ఏర్పాటు చేయగలదు. రాజకీయ అస్థిరత ఉన్నచోట అభివృద్ధి జరగదు. - అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి.