Loan Apps Threats : ఆన్లైన్ లోన్ యాప్ ల ఆగడాలకు అడ్డుకట్టపడడంలేదు. లోన్ యాప్ లో రుణం తీసుకుంటే ఇక చావే శరణ్యం అన్నంతగా వేధిస్తున్నారు రికవరీ ఏజెంట్లు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ఉసురు తీసిన లోన్ యాప్ లు.. తాజాగా రాజమహేంద్రవరంలో దంపతులు ఆత్మహత్యకు కారణమయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి చెందిన కొల్లి దుర్గాప్రసాద్‌ (32), రమ్యలక్ష్మి (24) దంపతులు రాజమహేంద్రవరంలోని శాంతినగర్‌లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దుర్గాప్రసాద్‌ జొమాటో డెలివరీ బాయ్‌ పనిచేస్తున్నారు. అతడి భార్య రమ్యలక్ష్మి మిషన్‌ కుట్టుకుంటూ జీవిస్తున్నారు.  


లోన్ యాప్ లో అప్పు 


ఇటీవల ఇంటి అవసరాల కోసం ఆన్ లైన్ లోన్ యాప్‌లో కొంత నగదు అప్పుగా తీసుకున్నారు. ఆ అప్పు సకాలంలో తీర్చకపోవడంతో  లోన్‌ యాప్‌కు సంబంధించిన టెలీకాలర్స్‌ ఫోన్ కాల్స్ చేసి వేధింపులు మొదలుపెట్టారు. అప్పు చెల్లించకపోతే భార్యభర్తల నగ్న చిత్రాలు ఆన్ లైన్ లో పెడతామని బెదిరించారు. దుర్గాప్రసాద్‌ బంధువులకు, స్నేహితులకు కాల్స్ చేసి తీసుకున్న విషయాన్ని చెప్పేవారు. ఈ ఘటనలతో పరువు పోయిందని భావించిన దంపతులు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.  


భార్యభర్తలు ఆత్మహత్య 


లోన్ యాప్‌ నిర్వాహకులు వేధింపులు ఎక్కువ అవ్వడంతో తట్టుకోలేకపోయిన దుర్గాప్రసాద్, రమ్యలక్ష్మి.. ఈ నెల 5న పిల్లలను ఇంట్లో వదిలేసి గోదావరి గట్టుపై ఓ లాడ్జిలో దిగి  పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. బంధువులకు ఫోన్‌ చేసి తాము ఆత్మహత్యకు చేసుకుంటున్నట్లు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలిసిన బంధువులు లాడ్జి వద్దకు చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న భార్యాభర్తలను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం దుర్గాప్రసాద్, రమ్యలక్ష్మి మృతి చెందారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు సోమరాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రుల మృతితో ఆ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. తల్లిదండ్రులు ఇంక తిరిగిరారు అని తెలియక వారి కోసం ఎదురుచూస్తున్నారు. 






చలించిపోయిన సీఎం జగన్ 


ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. వేధింపులకు పాల్పడుతున్న లోన్ యాప్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఆర్బీఐ అనుమతి లేని యాప్ లపై చర్యలకు ఆదేశాలు ఇచ్చింది.  రాజమహేంద్రవరంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సీఎం జగన్ చలించిపోయారు. తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులు ఇద్దరికి చెరో రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. చిన్నారుల సంరక్షణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ను ఆదేశించారు. 


Also Read : AP Cabinet : కొత్త కేబినెట్‌ సీఎం జగన్‌ను మెప్పించలేకపోతోందా ? నవంబర్‌లో ముగ్గురికి ఉద్వాసన తప్పదా ?


Also Read : Amit Shah Mumbai visit: అమిత్ షా పర్యటనలో భద్రతా లోపం- ఆంధ్రా ఎంపీ సెక్రటరీ అరెస్ట్!