ICC T20I Rankings:
దుబాయ్ లో ఆసియా కప్ పోటీలు జరుగుతున్న సమయంలో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. బ్యాటింగ్ జాబితాలో ఇప్పటివరకు తొలి స్థానంలో ఉన్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం రెండో స్థానానికి దిగాడు. మొదటి స్థానాన్ని అదే జట్టు ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన మార్ క్రమ్ మూడోస్థానంలో కొనసాగుతున్నాడు. మొన్నటి వరకు రెండో స్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ 4 వ స్థానానికి పడిపోయాడు.
పడిపోయిన సూర్య స్థానం
ఆసియా కప్ లో జరిగిన మూడు మ్యాచ్ లలో రాణించిన రిజ్వాన్ 192 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్ గా ఉన్నాడు. 815 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నమెంట్లో అంతగా రాణించలేకపోయిన బాబర్ అజాం రెండో స్థానానికి పడిపోయాడు. హాంకాంగ్ తో మినహా పాక్, శ్రీలంకలపై సరిగ్గా ఆడలేకపోయిన భారత యువ కెరటం సూర్యకుమార్ 2 నుంచి 4 వ స్థానానికి దిగజారాడు. శ్రీలంకతో మ్యాచ్ లో 71 పరుగులు చేసిన రోహిత్ శర్మ 14 వ స్థానంలో, విరాట్ కోహ్లీ 29వ స్థానంలో ఉన్నారు.
బౌలర్ల జాబితాలో ఒక్కరూ లేరు
అల్ రౌండర్ల జాబితాలో అఫ్ఘాన్ కెప్టెన్ మహ్మద్ నబీ (256) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. హార్దిక్ పాండ్య ఐదో స్థానంలో ఉన్నాడు. బౌలర్ల కేటగిరీలో ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్ వుడ్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బౌలింగ్ జాబితాలో భారత్ నుంచి ఏ ఒక్కరూ టాప్- 10 లో లేకపోవడం గమనార్హం.