Rajahmundry News :  ప్రజా సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం ప్రతీ సోమవారం స్పందన పేరుతో ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించి వాటికి పరిష్కారాన్ని చూపుతోంది. దీనికోసం జిల్లా కలెక్టరేట్ నుంచి మండల స్థాయిలో తహసీల్దార్ కార్యాలయాల వరకు ప్రతీ సోమవారం కచ్చితంగా స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అధికారులు. అయితే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో నిర్వహించిన స్పందనకు ఎవ్వరూ ఊహించని ఫిర్యాదు ఒకటి అందింది. ఫిర్యాదును చూసి షాక్ అయినా అధికారులు వెంటనే తేరుకుని చివరకు వెతికి పట్టుకున్నారు. దాన్ని పోగొట్టుకున్న వ్యక్తికి అప్పగించారు. ఇంతకీ ఏం వెతికారో.. ఈ యజమాని ఏం ఫిర్యాదు ఇచ్చారో తెలుసుకోవాలంటే చదివేయండి.  


అసలేం జరిగింది?


రాజమండ్రి కార్పోరేషన్ కార్యాలయంలో అధికారులు సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం కార్యాలయానికి ఓ ఫోన్ వచ్చింది. తాను రాజమండ్రి ఇన్నీసుపేటకు చెందిన నాగలక్ష్మిని అని, ఇంట్లో చెత్తను మున్సిపల్ కార్పొరేషన్  ఏర్పాటు చేసిన చెత్తతొట్టేలో వేసే క్రమంలో పొరపాటున తన చేతికి ఉన్న బంగారు ఉంగరం పాడేసుకున్నానని, దానిని వెతికి ఇవ్వాలని కోరింది. అంతే కాకుండా వెంటనే కార్యాలయానికి చేరుకుని లిఖిత పూర్వకంగానూ ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు స్పందించి శానిటేషన్ సిబ్బందిని పంపించి వెతికించారు. దీంతో అక్కడికి వెళ్లిన సిబ్బంది చెత్తతొట్టెలో ఉన్న చెత్తనంతటినీ జల్లెడ పట్టి చివరకు వెతికి ఉంగరాన్ని కనుగొన్నారు. ఉంగరాన్ని వెతగ్గా దొరికిందని, కమిషనర్ దినేష్ కుమార్ కు తెలియజేయడంతో ఆమెకు అందజేయాలని సూచించడంతో దానిని నాగలక్ష్మికి అందజేశారు. దీంతో పోగొట్టుకున్న ఉంగారాన్ని తిరిగి పొందడంతో ఫిర్యాదుదారు సంతోషం వ్యక్తం చేశారు. అధికారులకు పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలిపింది. 


ఏపీ, తెలంగాణ మధ్య శ్రీశైలం కరెంట్ మంటలు - కృష్ణాబోర్డుకు లేఖ రాసిన జగన్ సర్కార్ !


అయిదు గంటలపాటు  


చెత్త వేసే క్రమంలో చేతికున్న ఉంగరాన్ని జారవిడుచుకున్న నాగలక్ష్మి,  చేతికి ఉంగరం లేకపోవడంతో ఇళ్లంతా వెతికింది. అయినా అది దొరక్కపోవడంతో తాను ఆఖరిగా కార్పొరేషన్ చెత్తతొట్టెదగ్గరకు వెళ్లానని, అక్కడే కచ్చితంగా జారవిడుచుకున్నానని గమనించి అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే పారిశుద్ధ్య కార్మికులు మాత్రం అయిదు గంటలపాటు శ్రమించి చెత్తనంతటినీ జల్లెడపట్టాల్సి వచ్చింది. శానిటేషన్ ఇన్స్పెక్టర్ బుద్ధ శ్రీను, శానిటేషన్ సెక్రటరీ ఎం.రాజేష్ దగ్గరుండి మేస్త్రీ శ్రీనుతో పాటు పారిశుద్ధ్య కార్మికులు బంగారు శ్రీను జయకుమార్ తదితరులు వెతికిస్తుంటే అటువైపుగా వెళ్లేవారంతా మాత్రం ఎందుకు వెతుకుతున్నారని ఆరా తీసి విసిగించారట. కానీ బంగారం ఉంగరం కోసం మున్సిపల్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు కనిపెట్టారు. 


Also Read : Minister Gudivada Amarnath : కేసీఆర్ ను చూసి నేర్చుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో వైసీపీ లేదు, మంత్రి హరీశ్ రావుపై గుడివాడ అమర్ నాథ్ ఫైర్


Also Read : Secunderabad News : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో బాలుడి కిడ్నాప్, రెండు గంటల్లో ఛేదించిన పోలీసులు!