Secunderabad News : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏడాది బాలుడు కిడ్నాప్ కేసును రెండు గంటల్లో ఛేదించారు రైల్వే పోలీసులు. బాలుడు కిడ్నాప్ గురైన సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. బాలుడ్ని కిడ్నాప్ చేసిన మహిళను గుర్తించి ఆమె వెళ్లే ఆటోను కవాడిగుడాలో పట్టుకున్నారు. బాలుడిని క్షేమంగా రక్షించి కిడ్నాప్ కు పాల్పడిన మహిళను అదుపులోకి తీసుకున్నారు రైల్వే పోలీసులు. గుంటూరు నుంచి సికింద్రాబాద్ చేరుకున్న ఒంటరి మహిళ వద్ద బాబుని గుర్తించిన మరో మహిళ ఆమెతో కలిసి ఉంటూ బాబుకి బిస్కెట్లు ఇచ్చి మచ్చిక చేసుకుంది. తల్లి టికెట్ కొనడానికి వెళ్లగానే వెంటనే మహిళ బాబును తీసుకొని పరార్ అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించి వాళ్లు వెళ్తోన్న ఆటోను పట్టుకున్నారు.
ఐదు బృందాలు రెండు గంటల్లో
ఈ కిడ్నాప్ ఉదంతంపై రైల్వే ఎస్పీ అనురాధ మీడియాతో మాట్లాడారు. 'శుక్రవారం ఉదయం ఒక సంవత్సరం బాబును ఓ మహిళ కిడ్నాప్ చేసినట్టు సమాచారం వచ్చింది. బాబును కిడ్నాప్ చేసింది సోనీ అనే మహిళగా గుర్తించాం. మారగమ్మ అనే మహిళ గుంటూరు నుంచి సేడం వెళ్లడానికి నర్సాపూర్ ట్రైన్ ఎక్కింది. ఆమె గుంటూరు నుంచి సికింద్రాబాద్ వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిందితురాలు సోనీ పరిచయమైంది. మారగమ్మ అనే మహిళ వద్దకు వచ్చిన సోనీ తాను కూడా సేడం వెళ్తున్న అని చెప్పి పరిచయం చేసుకుంది. మారగమ్మ టికెట్ తీసుకోవడానికి క్యూ లైన్ లో నిల్చున్న సమయంలో రష్ ఎక్కువగా ఉందని బాబును తాను పట్టుకుంటానని చెప్పింది.
దీంతో మారగమ్మ బాబు ను నిందితురాలికి ఇచ్చింది. పది నిమిషాల్లో మారగమ్మ టికెట్ తీసుకుని వచ్చే లోపు బాబును తీసుకుని సోనీ పరారైంది. దీంతో ఆందోళన చెందిన మారగమ్మ పోలీసులకి సమాచారం ఇచ్చింది. వెంటనే ఐదు బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాం' అని ఎస్పీ అనురాధ తెలిపారు.
పిల్లలు లేకపోవడంతో
స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించామని ఎస్పీ అనురాధ తెలిపారు. ముందుగా గేట్ నెంబర్ ఒకటి యువతి బాబును తీసుకువెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ గుర్తించామన్నారు. దీంతో లా అండ్ ఆర్డర్ పోలీసులను కూడా అలెర్ట్ చేశామన్నారు. గణేష్ టెంపుల్ వద్ద నిందితురాలు బావతో ఆటో ఎక్కుతున్న సీసీటీవీ లభ్యమైనదన్నారు. సీసీటీవీలో లభించిన ఆటో నెంబర్ ఆధారంగా ఆటో డ్రైవర్ ను ప్రశ్నించామని తెలిపారు. ఆటో డ్రైవర్ బాబుతో వచ్చిన మహిళను కవాడిగుడాలో డ్రాప్ చేశానని చెప్పాడన్నారు. దీంతో కవాడిగూడ వెళ్లి బాలుడిని రెస్క్యూ చేశామని ఎస్పీ తెలిపారు. రెండు గంటల్లోనే ఈ కేసును ఛేదించామన్నారు. నిందితురాలికి పిల్లలు లేకపోవడంతో ఇంట్లో గొడవలు అవుతూ ఉన్నాయని, ఆ కారణంతోనే నిందితురాలు బాబును కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందని ఎస్పీ అనురాధ తెలిపారు.
Also Read : Hyderabad News: మీ వెహికిల్ ఇక్కడ పార్క్ చేశారో ఇక అంతే! Hyd లో ట్రాఫిక్ సమస్యకు కొత్త స్ట్రాటజీ
Also Read : భర్త అనుమానమే నిజమైంది, ఆమె మరొకరితో దొరికిపోయింది - చివరకు ఏమైందంటే?