AP Vs TS : తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు సుదీర్ఘంగా సాగుతున్నాయి. తాజాగా మరోసారి తెలంగాణపై ఏపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. అవసరం లేకున్నా శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం లో తెలంగాణ విద్యుత్ ఉత్పాదన చేస్తోందని ఏపీ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్ కు ఏపీ జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ లేఖ రాశారు. శ్రీశైలం , నాగార్జునసాగర్ ప్రాజెక్టు ల్లో పూర్తి స్థాయి నీటి మట్టం ఉందని ఏపీ అధికారులు లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ జల విద్యుత్ ఉత్పాదన వలన నీరు వృథాగా సముద్రంలోకి వెళుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇలా చేయటం వల్ల సీజన్ చివరిలో పంటలు సాగు, తాగునీరుకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఏపీ అధికారులు పేర్కొన్నారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వాన్ని శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయాలని కేఆర్ఎంబీ చైర్మన్‌ను కోరారు.
తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతీ ఏడాది విద్యుత్ ఉత్పత్తి పంచాయతీ
నిజానికి ఈ జలవిద్యుత్ ఉత్పత్తి వివాదం ఇదే మొదటి సారి కాదు. ప్రతీ సారి వస్తోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తి విషయమై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం తరచూ వస్తోంది. ముఖ్యంగా శ్రీశైలంలో తెలంగాణ విచ్చలవిడిగా విద్యుదుత్పత్తి జరుపుతోందని ఏపీ ఆరోపిస్తుండగా..విద్యుదుత్పత్తి అవసరాల కోసమే శ్రీశైలం జలాశయం నిర్మాణం జరిగిందంటూ తెలంగాణ వాదిస్తోంది. రాష్ట్ర అవసరాల మేరకు జలవిద్యుదుత్పత్తి కొనసాగిస్తామని, జల విద్యుత్ కేంద్రాలపై కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పెత్తనాన్ని అంగీకరించేది లేదని తేల్చిచెబుతోంది.
నీటిని దుర్వినియోగం చేస్తున్నారని తెలంగాణపై ఏపీ ఆరోపణ
తెలంగాణ విచ్చలవిడిగా విద్యుదుత్పత్తి జరిపి శ్రీశైలం జలాశయాన్ని దుర్వినియోగం (మిస్ మ్యానేజ్‌మెంట్) చేస్తోందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే రాష్ట్ర విద్యుత్ అవసరాలు భారీగా పెరిగిపోయాయని, ఎత్తిపోతల పథకాలు, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు జల విద్యుదుత్పత్తి తప్ప మరో మార్గం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇది దుర్వినియోగం కాదని, సంక్షోభ నివారణ కోసం జల విద్యుదుత్పత్తి చేస్తున్నామని పేర్కొంటోంది. రెండు రాష్ట్రాలు ఇలా వాదోపవాదాలు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే కేఆర్ఎంబీ చాలా సార్లు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదు. తమ అవసరాల కోసం విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తూనే ఉంది. ఇలా విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల నీటిని సముద్రంలోకి వదిలేయాల్సి వస్తోందని ఏపీ అంటోంది.
తమ హక్కుల ప్రకారమే నీటిని వాడుకుంటున్నామన్న తెలంగాణ
శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఏపీ తమ వాటాగా వచ్చే నీటిని రాయలసీమకు తరలిస్తూ ఉంటుంది. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలిచేలోపే... తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు వదిలేస్తోంది. ఈ కారణంగా సాగర్ లోకి నీరు చేరుతున్నాయి.ఇప్పటికే సాగర్ నిండిపోవడంతో దిగువకు వదిలి వేయక తప్పడం లేదు. అందుకే శ్రీశైలంలో నీరు రాయలసీమకు పూర్తి స్థాయిలో తరలించలేకపోతున్నారు.