Punjab Crime News:



పట్టపగలే కాల్పులు..


పంజాబ్‌లో పట్టపగలే ఓ దుకాణాదారుడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. భటిండాలో జరిగిందీ ఘటన. షాప్ ఎదుట కుర్చీలో కూర్చుని ఉన్న దుకాణాదారుడిపై కొందరు వచ్చి కాల్పులు జరిపారు. వరుసగా బులెట్‌లు శరీరంలోకి దూసుకుపోయాయి. "వాళ్లను పట్టుకోండి" అని గట్టిగా అరుస్తూనే కుప్ప కూలిపోయాడు బాధితుడు. మృతుడి పేరు హర్జీందర్ సింగ్‌ జోహ్లాగా వెల్లడించారు పోలీసులు. ఈ కాల్పులు జరిగిన చోట సీసీ కెమెరా ఉండడం వల్ల అందులో ఆ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. హర్జీందర్ సింగ్ కుర్చీలో కూర్చుని ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో బైక్‌పై ఇద్దరు వ్యక్తులు అటుగా వచ్చారు. వెనకాల కూర్చున్న వ్యక్తి బండి దిగి గన్ తీసి హర్జీందర్ సింగ్‌పై కాల్పులు జరిపాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర గాయాలు కావడం వల్ల చికిత్స అందించినా లాభం లేకుండా పోయింది. 


"ఈ కాల్పులు జరిగినప్పుడు నేను షాప్‌లోనే ఉన్నాను. ఎవరో బాణసంచా కాల్చుతున్నారేమో అనుకున్నాను. కానీ హర్జీందర్ సింగ్ ఒక్కసారిగా అరిచాడు. తననెవరో కాల్చారని చెప్పాడు. ఆ కాల్చిన వాళ్లను పట్టుకోవాలని చెప్పాడు. కానీ అప్పటికే వాళ్లు బైక్‌పై పారిపోయారు. బైక్‌పై ఇద్దరు వ్యక్తులున్నారు"


- స్థానికులు 




ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఇద్దరు వ్యక్తుల్ని ఇప్పటికే గుర్తించారు. నిందితుల్ని పట్టుకునేందుకు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్టు వెల్లడించారు. ఈ ఘటన రాజకీయంగానూ అలజడి రేపింది. ఆప్ హయాంలో పంజాబ్‌లో ఇలాంటి నేరాలు పెరుగుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.