మొన్న పునీత్ రాజ్‌కుమార్.. నిన్న మంత్రి గౌతమ్ రెడ్డి మరణవార్తలు మర్చిపోకముందే ప్రముఖ కన్నడ రేడియో జాకీ రచన గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె గుండెపోటు కారణంగా చనిపోయినట్లు వైద్యులు తేల్చారు. ఆమె వయసు కేవలం 39 ఏళ్లే.
ఏం జరిగింది?
బెంగళూరు జీపీ నగర్లో నివాసం ఉంటున్న రచనకు ఈ రోజు ఉదయం ఛాతి నొప్పి వచ్చింది. అయితే ఆసుపత్రికి తరలించేటప్పుడు మార్గమధ్యంలోనే ఆమె చనిపోయినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.
మానసిక ఒత్తిడే
కొంత కాలంగా రచన మానసిక ఒత్తిడికి లోనైనట్లు ఆమె స్నేహితులు చెప్తున్నారు. ఫ్రెండ్స్‌కు కూడా దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. రేడియో మిర్చితో తన కెరీర్‌ను ప్రారంభించిన రచన.. రేడియో సిటీలో కొంత కాలం పని చేశారు. ఏడేళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశారు.
గౌతమ్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రి మేకపోటి గౌతమ్ రెడ్డి (50) కూడా సోమవారం హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో హైదరాబాద్ జూబ్లీహీల్స్‌లోని తన స్వగృహంలో తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు కారులో ఆయన్ను అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అత్యవసర విభాగంలో చేర్చిన వైద్యులు కార్డియో పల్మనరీ రిససటేషన్ (సీపీఆర్) చేశారు. ఎంత ప్రయత్నించినా గౌతమ్ రెడ్డిలో చలనం లేకపోవడంతో ఉదయం 9.16 గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు.
పునీత్ కూడా
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కూడా ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఒత్తిడి వల్లే ఇలా చిన్న వయసులోనే గుండెపోటు వస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇలా వరుసగా చిన్న వయసువారు గుండెపోటుతో మృతి చెందడంపై ఆందోళన నెలకొంది.
Also Read: India Pakistan News: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్రేజీ కోరిక- నరేంద్ర మోదీతో టీవీ డిబేట్ కావాలట!