'భారతీయ జనతా పార్టీని.. ఎలాగైనా గద్దె దించాలి' ఇది ప్రస్తుతం దేశంలో ఏ ప్రతిపక్ష పార్టీని కదిలించినా వినిపించే మాట. అయితే భాజపాను ఓడించడం కాంగ్రెస్ తరం కాదని ప్రాంతీయ పార్టీలే ఓ పొలిటికల్ ఫ్రంట్‌ను సిద్ధం చేయాలని బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ బాధ్యతను భూజాన ఎత్తుకొని పలు రాష్ట్రాల సీఎంలను కలిసే పనిలో బిజీబిజీగా ఉన్నారు.
కొత్త వార్త
ఈ ఫ్రంట్ ఏర్పాటు కోసమే సీఎం కేసీఆర్ ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. త్వరలోనే ఓ కొత్త రాజకీయ వేదికను సిద్ధం చేస్తామని సమావేశం అనంతరం ఇరువురు నేతలు చెప్పారు. అయితే తాజాగా మరో వార్త కూడా వినిపిస్తోంది. అదేంటంటే.. 2022లో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షం తరఫున అభ్యర్థిగా బిహార్ సీఎం నితీశ్ కుమార్ లేదా కేసీఆర్‌ను బరిలోకి దింపాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయట.
అవును బిహార్ సీఎం నితీశ్ కుమార్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపితే కాంగ్రెస్ కూడా మద్దతిస్తుందనేది ఆయా పార్టీల వాదన. దీనిపై ఠాక్రే- కేసీఆర్ భేటీలో కూడా చర్చ జరిగిందన్నది ఆ వార్తల సారాంశం. అయితే ఈ వార్తలను శివసేన ఖండించింది.
కానీ ఏబీపీ న్యూస్ సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ మినహా ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ థర్డ్ ప్రంట్ ఏర్పాటు చేసి.. రాష్ట్రపతి అభ్యర్థిగా నితీశ్ కుమార్‌ను లేదా కేసీఆర్‌ను ప్రకటించాలని చూస్తున్నాయి.
కాంగ్రెస్ మద్దతు
నితీశ్ కుమార్ లేదా కేసీఆర్ లాంటి బలమైన నేతను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ కూడా మద్దతిచ్చే అవకాశం ఉందని పార్టీలు భావిస్తున్నాయి. సీఎం కేసీఆర్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కలిసి ఈ వ్యూహం రచించినట్లు సమాచారం. ఇతర ప్రతిపక్ష పార్టీలను ఈ నిర్ణయంపై ఏకతాటిపైకి తెచ్చేందుకు సీఎం కేసీఆర్.. పలు రాష్ట్రాల నేతలను కలుస్తున్నారని తెలుస్తోంది.
నితీశ్ వస్తారా?
ప్రస్తుతం నితీశ్ కుమార్ పార్టీ జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) ఎన్‌డీఏలో ఉంది. కానీ ఈ మధ్య భాజపా, జేడీయూ మధ్య విభేదాలు వస్తున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. బిహార్‌లో కులగణన చేయాలని నితీశ్ కుమార్ పలుసార్లు కోరినప్పటికీ భాజపా ససేమిరా అని చెప్పింది. ఈ విషయంలో నితీశ్‌కు ప్రతిపక్ష ఆర్‌జేడీ కూడా మద్దతిస్తోంది. దీంతో నితీశ్ మళ్లీ ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అంటున్నారు.
ఇటీవల ప్రశాంత్ కిశోర్.. నితీశ్ కుమార్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్ ప్లాన్ గురించి నితీశ్‌తో కిశోర్ చర్చించినట్లు సమాచారం.
బరిలోకి కేసీఆర్
రాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నుకునేంత మెజార్టీ భాజపాకు ఉంది. ఒక వేళ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటై రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటిస్తే.. కాంగ్రెస్ మద్దతు తప్పక కావాలి.
మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిగా కేసీఆర్‌ను కూడా ప్రతిపక్ష పార్టీలు పరిగణలోకి తీసుకుంటున్నట్లు ప్రశాంత్ కిశోర్ వర్గాల నుంచి ఏబీపీకి సమాచారం వచ్చింది.