Crime News : పాత నాణెలకు.. పాత వస్తువులకు లక్షలు ఇస్తామంటూ సోషల్ మీడియాలో మోసగాళ్లు ప్రకటనలు చేస్తూ ఉంటారు. వీటిని చూసి ఆ పాత వస్తువులు ఎవరి దగ్గర ఉన్నాయో కనుక్కుని మరీ దొంగతనాలు చేయడానికి కొన్ని ముఠాలు సిద్ధమైపోతున్నాయి. ఇలా ఓ పాత ల్యాండ్ లైన్ ఫోన్ తెచ్చి ఇస్తే లక్షలు వస్తాయని నమ్మిన ఓ ముఠా... అ ఫోన్ ఓ ఇంట్లో ఉందని చొరబడి ..దొరకకపోయే సరికి హత్య చేసి దొరికిన డబ్బు, నగలు పట్టుకుపోయారు. ఆముఠాను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు.
రైల్వే క్వార్టర్స్‌లో దారుణ హత్యకు గురైన మహిళ
విజయవాడలో ఈ నెల 9వ తేదీన సత్యన్నారాయణ పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న కట్టుంగ సీత అనే మహిళ ఆమె ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యింది. గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి, ఆమె ఒంటి పై ఉన్న బంగారు నగలను దొంగిలించి పరారయ్యారు. దొరికిన ఆధారాలన్నింటినీ పరిశీలించి చివరికి ఆరుగుర్ని అరెస్ట్ చేశారు. ఎందుకు హత్య చేశారంటే వారు చెప్పిన కారణాలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు.
పాత ఫోన్లు దొంగతనం చేయడానికి వచ్చి మహిళ హత్య !
ముస్తాబాద్ గ్రామానికి చెందిన గుమ్మడి నాగేశ్వర రావు అనే మేస్త్రి, తాపీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతని వద్ద ఐదారుగురు కూలీలు పనిచేస్తూ వుంటారు, ఇతనికి పరిచయం వున్న రైల్వేలో పని చేసే నూతంగి సాంబశివరావు ద్వారా రైల్వేలో టెలికాం డిపార్ట్మెంట్ లో టెక్నిషన్ గా పని చేస్తున్న కట్టుంగ సత్యన్నారాయణ వద్ద విలువైన పాత ఫోన్ లు ఉన్నాయని తెలుసుకున్నాడు. పాత ఫోన్లు అమ్మితే లక్షల్లో నగదు వస్తుందని.. వాటిని దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ దొంగతనానికి వెళ్లినప్పుడు ఫోన్లు దొరకలేదు. దీంతో సత్యనారాయణ భార్యపై ఉన్న నగలపై దొంగల దృష్టి పడింది.
దొంగతనం చేసిన బంగారం అమ్మేందుకు ప్రయత్నంలో దొరికిపోయిన దొంగలు
ఇంట్లోకి చొరబడిన వెంటనే సత్యనారాయణ భార్య సీతను కట్టేసిన దొంగలు.. అరిస్తే కత్తితో పొడుస్తామని బెదిరించి, ఆమె ముక్కు, నోటిని పక్కన వున్న టవల్ తో కట్టేశారు. ఇంకో టవల్ తో కాళ్ళు చేతులు కట్టేశారు. మరొక టవల్ తీసుకుని మెడకు కట్టేసి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక హతురాలి ఒంటిపైన ఉన్న బంగారు నగలను తీసుకునిల పరారయ్యారు. తర్వాత బంగారాన్ని పంచుకున్నారు. కానీ పోలీసులు కనిపెట్టి అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు.