మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో కారు దగ్ధం కేసులో అనుమానాలెన్నో తెరమీదకు వస్తున్నాయి. కారు మంటలకు ఆహుతైంది.. ధర్మకార్ శ్రీను అనే వ్యక్తి సజీవంగా దహనమయ్యారు. కానీ ఎవరు కాల్చారు..? ఎందుకు నిప్పు పెట్టారన్నది ప్రస్తుతానికి మిస్టరీనే . అర్దరాత్రి కారుకి నిప్పు పెట్టిన వ్యక్తులు పారిపోయారు. పోలీసులు స్పాట్‌కు చేరుకునేలోపే మంటల ఆరిపోయాయి. ముందు సీట్లో వెనక సీట్లో ఎవరూ లేరు. కానీ డిక్కీలో కాలిపోయిన డెడ్‌బాడీ కనిపించింది. అది ధర్మాకర్ శ్రీనివాస్ ది. కానీ ఇంతకీ ఆ శ్రీనివాస్ ఎవరు?
కటికె రాంచందర్ కొడుకు శ్రీను
కష్టపడి వివిధ వ్యాపారాలు చేసి ఉన్నత స్థానంలోకి వెళ్లిన దివంగత ధర్మకార్ రాంచందర్ ఏకైక తనయుడు, సీనిమ్యాక్స్ యజమాని ధర్మకార్ శ్రీనివాస్. చిన్నప్పుడే వివిధ మతపరమైన విషయాల్లోకి వెళ్లి వార్తల్లోకి ఎక్కాడు. తరువాత రెండుసార్లు నక్సలైట్లు కాల్పులు జరపగా.. తప్పించుకున్నాడు. అనేక వివాదాల్లో శ్రీను పేరు వినిపించేదని తెలుస్తోంది. రాంచందర్ మృతి చెందక ముందు నుంచే రియల్ఎస్టేట్ వ్యాపారంలో ధర్మకార్ శ్రీను చురుకుగా ఉండేవాడు. ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. మరో వైపు.. మెదక్ జిల్లాకు చెందిన టీడీపీ నాయకురాలి కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
హత్యకు కారణం ఆర్థిక లావాదేవిలేనా?
కటికె శ్రీను దారుణ హత్యకు ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణం అనేది చర్చనీయాంశంగా మారింది. వరంగల్ తో పాటు చాలా చోట్ల కోట్ల రూపాయల డీలింగ్స్ చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఎవరితోనైనా.. శత్రుత్వం పెరిగి.. హత్య వరకు దారితీసిందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు.
శ్రీనివాస్ ఆదివారం స్వగ్రామం నుంచి హైదరాబాద్ వచ్చాడు. అతడి ఫోన్ గత రాత్రి నుంచి స్విచ్ఛాఫ్ వస్తుందని ఆయన భార్య వెల్లడించింది. ఫోన్ కాల్ డేటాను పోలీసులు పరిశీలించడంతో పాటు, ఆ మార్గంలోని సీసీటీవీ కెమెరాలను కూడా పోలీసులు క్షుణ్నంగా జల్లెడ పడుతున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం.. చంపేసి, ఆ తర్వాత మృతదేహాన్ని డిక్కీలో కుక్కేసి.. కారు మొత్తానికి నిప్పు పెట్టినట్టుగా అర్థమవుతోంది.
ధర్మకార్ శ్రీను సజీవ దహ కేసును మెదక్ జిల్లా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఎలాగైనా తొందరలోనే హంతకులను పట్టుకోవాలని చూస్తున్నారు. మంటల్లో కాలిబూడిదైన TS 05 EH 4005 అనే నెంబర్ ప్లేట్ ఉన్న హోండా సివిక్ కారు శ్రీనివాస్ పేరు మీదనే ఉంది. ఓ చిన్న క్లూ దొరికినా.. మంటల వెనక మిస్టరీని తేల్చేస్తారు పోలీసులు.