Police Firing In Pedda Amberpet: దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకునే క్రమంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad) శివారు పెద్ద అంబర్ పేట ఓఆర్ఆర్ (ORR) వద్ద శుక్రవారం జరిగింది. మహారాష్ట్రకు చెందిన పార్థి గ్యాంగ్ నగర శివారు ప్రాంతాలు, ఒంటరిగా ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడ్డారు. నల్గొండ సీసీఎస్ పోలీసులు వీరిపై నిఘా ఉంచి వీరిని పట్టుకునేందుకు యత్నించారు. ఇదే క్రమంలో పక్కా సమాచారంతో వారిని గుర్తించి పట్టుకునేందుకు ఛేజ్ చేస్తుండగా.. దుండగులు పోలీసులపై కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం నలుగురు గ్యాంగ్ సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని నల్గొండకు తరలించారు. దీనిపై విచారణ చేస్తున్నామని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు.