Cyber Criminals Looted Money From Young Woman In Hyderabad: హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువతిని సైబర్ నేరగాళ్లు క్రెడిట్ కార్డు చెల్లింపుల పేరుతో బురిడీ కొట్టించారు. బెదిరింపులకు పాల్పడుతూ దాదాపు రూ.7.50 లక్షలు దోచేశారు. చివరకు మోసపోయానని గ్రహించిన బాధితురాలు తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ యువతికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి.. క్రెడిట్ కార్డు నుంచి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించలేదని చెప్పాడు. అయితే, తనకు క్రెడిట్ కార్డే లేదని సదరు యువతి చెప్పగా.. కస్టమర్ కేర్‌తో మాట్లాడాలని మరో వ్యక్తికి కాల్ ఫార్వార్డ్ చేశాడు. అతను ఆమె ఆధార్ తనిఖీ చేస్తున్నట్లు చెప్పి.. బిహార్, ముంబయి, తమిళనాడుతో పాటు మరో ప్రాంతంలో ఆమె పేరిట క్రెడిట్ కార్డులు ఉన్నాయని.. వాటి నుంచి రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల నగదు బదిలీ జరిగిందని బెదిరింపులకు పాల్పడ్డాడు. మనీ లాండరింగ్ చట్టం ప్రకారం కేసు నమోదవుతుందని భయపెట్టాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని.. సీబీఐ విచారిస్తున్నప్పుడు విషయం చాలా రహస్యంగా ఉంచాలని చెప్పాడు.


రూ.7.50 లక్షలు దోచేశారు


సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మిన యువతి వారు చెప్పిన అకౌంట్‌కు రూ.7.50 లక్షలు చెల్లించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని.. విచారణ పూర్తయ్యాక ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని చెప్పడంతో డబ్బు చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే, యువతి తన మిత్రులకు విషయం చెప్పడంతో మోసపోయినట్లు గ్రహించారు. తనకు న్యాయం చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Also Read: NCW: మియాపూర్‌లో యువతిపై అత్యాచార ఘటన - జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం