Deputy CM Pawan Kalyan Serious On Documents Burnt Issue: విజయవాడలోని (Vijayawada) కృష్ణా కరకట్టపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (Pollution Control Board) రికార్డుల దగ్ధం చేసిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్ధం చేసిన ఫైల్స్, రిపోర్టులకు సంబంధించిన వివరాలను వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. దీని వెనుక ఎవరున్నారనే అంశాలపై ఆరా తీసిన ఆయన.. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. 'అసలు పీసీబీ కార్యాలయాల్లో ఫైల్స్, రిపోర్టులు ఏ మేరకు భద్రంగా ఉన్నాయి. భద్రపరిచేందుకు అనుసరిస్తోన్న విధానాలు ఏంటో వెల్లడించాలి.' అని అధికారులకు నిర్దేశించారు. మరోవైపు, ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. రికార్డుల దగ్ధం ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. కాగితాలతో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్కులు, గుర్తింపు కార్డులు కూడా ఉండడంపై సీరియస్ అయ్యింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.


అసలేం జరిగిందంటే.?


కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పెదపులిపాక వద్ద నిర్మానుష్యం ప్రదేశంలో బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కారులో వచ్చిన దుండగులు కరకట్టపై బస్తాల్లోని దస్త్రాలను తగలబెట్టడం మొదలుపెట్టారు. ఈ వాహనంపై ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్ ఉంది. అక్కడే ఉన్న స్థానికులు ఏం తగలబెడుతున్నారని ప్రశ్నించారు. అవి ప్రభుత్వ దస్త్రాలని గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాటిపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) ఫొటోలు ఉండటంతో ఆ దస్త్రాలు తీసుకొచ్చిన కారు డ్రైవర్‌ను వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అవన్నీ పొల్యుషన్ కంట్రోల్ బోర్డు(Pollution Control Board)కు సంబంధించిన దస్త్రాలని డ్రైవర్ తెలిపాడు. అటుగా వెళ్తున్న ఓ టీడీపీ కార్యకర్త దీన్ని గమనించి.. దస్త్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి, పీసీబీ మాజీ ఛైర్మన్ సమీర్ శర్మ చిత్రాలు ఉండడంతో వెంటనే విషయాన్ని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చారు.


కాలుష్య నియంత్రణ మండలి (PCB), ఏపీ ఖనిజాభివృద్ది(APMDC) సంస్థలకు చెందిన బస్తాల కొద్దీ దస్త్రాలను దగ్ధం చేశారు. వీటిల్లో కొన్ని హార్డ్‌ డిస్కులు, సీఎంవోకు చెందిన పత్రాలు సైతం ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. పరారయ్యేందుకు యత్నించగా పట్టుకున్న డ్రైవర్‌ నాగరాజును గట్టిగా నిలదీయడంతో  పొల్యూషన్ కంట్రోల్‌ బోర్డు ఛైర్మన్ సమీర్‌శర్మ(Sameer Sharma) సూచనలతోనే ఈ ఫైళ్లు తగులబెట్టినట్లు  అంగీకరించాడు. అయితే, దగ్ధం చేసిన ఫైళ్లలో కీలక సమాచారం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. గతంలో పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రంలో విలువైన ఖనిజ సంపద దోపిడీకి గురైందని విమర్శించారు. ఇసుక తవ్వకాలపై సీఎం సమీక్ష నిర్వహించిన మరుసటి రోజే కీలక దస్త్రాలు తగులబెట్టడం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు.

 

వారి పాత్రపై చర్చ

 

మరోవైపు, దస్త్రాల దహనం ఘటనకు సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (PCB) మాజీ ఛైర్మన్ సమీర్ శర్మ, ఓఎస్డీ రామారావు పాత్ర ఉందంటూ ఎక్సైజ్ శాఖ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఓఎస్డీ రామారావును విచారణకు పిలిచారు. ఎక్సైజ్ శాఖలో రామారావు సుదీర్ఘకాలం పని చేశారు. కొత్త ప్రభుత్వంలో ముఖ్యులకు తాను ఓఎస్డీగా వెళ్తున్నట్లు కొంతకాలంగా ఆయన అందరితో చెప్పుకొంటున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ సహా మరికొందరు మంత్రులకు తాను సన్నిహితుడినని ప్రచారం చేసుకుంటున్నట్లు అంతటా చర్చ సాగుతోంది. ఎక్సైజ్ శాఖలో ఉద్యోగుల బదిలీలు, ఆర్వోఆర్ విషయాల్లో అక్రమాలకు తెర లేపారనే ఆరోపణలు ఉన్నాయి.