Best Thriller Movies On OTT: బయోపిక్స్ తెరకెక్కించడంలో, నిజమైన సంఘటనల ఆధారంగా కథను తీసుకొని దానిని థ్రిల్లర్‌గా మార్చడంలో బాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది. ప్రత్యేకంగా ఈ జోనర్లలో తెరకెక్కిన సినిమాలే బాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్స్‌గా నిలిచాయి. అదే సక్సెస్ ఫార్ములాను ఫాలో అవుతూ తాజాగా మరో హిందీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ‘మహారాజ్’ (Maharaj). థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అయ్యింది ఈ మూవీ. ‘మహారాజ్’తో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయం అయ్యాడు. తాజాగా స్ట్రీమింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు దక్కుతున్నాయి.


కథ..


‘మహారాజ్’ కథ విషయానికొస్తే.. కర్సన్‌దాస్ (జునైద్ ఖాన్)కు చిన్నప్పటి నుంచి తను చుట్టూ జరిగే ప్రతీ విషయం వెనుక కారణాలు వెతకడం ఇష్టం. సమాధానలు లేని ప్రశ్నలు ఉండవని తన నమ్మకం. అదే ఆసక్తితో పెద్దయిన తర్వాత రచయితగా మారుతాడు. పత్రికల్లో వార్తలు కూడా రాస్తాడు. 1862లో దేశవ్యాప్తంగా బ్రిటీష్ పాలన నడుస్తున్నా కూడా బొంబాయ్‌లో మాత్రం మహారాజ్ జేజే (జైదీప్ అహ్లావత్) చెప్పిందే శాసనం. జేజేను శ్రీకృష్ణుడి రూపమని, తను ఉండే హవేలినే దేవాలయం అని భావిస్తుంటారు. అందుకే తనకు ఎలాంటి సేవ చేయడానికి అయినా వెనకాడరు. అలా సేవ పేరుతో ఆడవారిని లైంగికంగా లొంగదీసుకుంటాడు జేజే. అలా ఒకసారి జేజే చూపు కర్సన్‌దాస్‌కు కాబోయే భార్య అయిన కిషోరి (షాలిని పాండే)పై పడుతుంది. కిషోరి కూడా జేజేకు సేవ చేయడానికి సంతోషంగా ఒప్పుకుంటుంది. వారిద్దరూ గదిలో శృంగారం చేస్తున్నప్పుడు ఇతరులు డబ్బులిచ్చి చూడడానికి అనుమతి కూడా ఉంటుంది.


కిషోరి.. జేజేకు సేవ చేయడానికి ఒప్పుకుంటుందని కర్సన్‌దాస్‌కు తెలిసి హవేలికి వెళ్తాడు. కిషోరిని అక్కడి నుంచి వచ్చేయమంటాడు కానీ తను ఒప్పుకోదు. మరుసటి రోజు కిషోరి చేసిన పనికి కర్సన్‌దాస్.. తనపై కోప్పడతాడు. ఇదంతా మూఢనమ్మకమని, జేజే అందరినీ మోసం చేస్తున్నాడని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అయినా కిషోరి వినకపోవడంతో తనతో పెళ్లిని రద్దు చేసుకుంటాడు. ఈ విషయాన్ని జేజేకు వెళ్లి చెప్తుంది కిషోరి. జేజే.. తనను ప్రేమగా దగ్గర తీసుకుంటాడు. కాసేపటి తర్వాత తన చెల్లి కూడా అదే జేజేకు సేవ చేయడానికి వచ్చిన విషయాన్ని కిషోరి గమనిస్తుంది. అప్పుడు కర్సన్‌దాస్ చెప్పిందంతా నిజమని తనకు అర్థమవుతుంది. బాధతో ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. కానీ చనిపోయే ముందు తను రాసిన లేఖలో జేజే గురించి ప్రజలకు తెలిసేలా చేయమని కోరుతుంది.


ఒకరోజు లీలావతి.. తన అన్నతో కలిసి జేజేను కలవడానికి వస్తాడు. జేజేతో సేవ చేసిన తర్వాతే లీలావతి గర్భవతి అయ్యిందని చెప్తాడు. అయితే తనకు అబార్షన్ చేయించమని జేజే చెప్తాడు. దీంతో లీలావతి అన్న జేజేను కొట్టబోతాడు. కానీ అక్కడ ఉన్నవారంతా తనను అడ్డుకుంటారు. లీలావతికి అబార్షన్ అవ్వడం కోసం ఒక విషం కలిపిన లడ్డును తనకు ఇస్తాడు జేజే. దీంతో తన ఆరోగ్యం దెబ్బతింటుంది. వారిని కాపాడడానికి కర్సన్‌దాస్ ప్రయత్నిస్తాడు. కానీ హవేలి నుంచి వచ్చిన మనుషులు వారిని లాక్కెళ్లిపోతారు. జేజే చేస్తున్న మోసాన్ని ప్రజలకు తెలిసేలా చేయాలని తానే కొత్తగా ఒక పత్రిక ప్రారంభించి అందులో వాటి గురించి రాస్తాడు. కానీ అవి ప్రజలకు చేరకుండా ఆపుతాడు జేజే. ఆ తర్వాత ఏం జరిగింది? జేజే మోసాన్ని ప్రజలకు కర్సన్‌దాస్ ఎలా తెలియజేస్తాడు? అనేది తెరపై చూడాల్సిన కథ.



నటనతో నడిపించారు..


అమీర్ ఖాన్ వారసుడి డెబ్యూ మూవీ కావడంతో ‘మహారాజ్’లో జునైద్ ఖాన్ నటన ఎలా ఉంటుంది అని ప్రేక్షకుల్లో ముందు నుండే ఆసక్తి క్రియేట్ అయ్యింది. సినిమాలో ఎన్నో పాత్రలు ఉన్నా జునైద్ ఖాన్, జైదీప్ అహ్లావత్ చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. ఇప్పటికే ఇలాంటి కథలు చాలా చూశామని అనిపించినా.. నటనతోనే ‘మహారాజ్’ను నడిపించారు యాక్టర్స్. ఒక మంచి సింపుల్ థ్రిల్లర్‌ను చూడాలంటే ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమ్ అవుతున్న ‘మహారాజ్’ను ట్రై చేయండి.


Also Read: నరకానికి చేరాలంటే ఈ 5 లెవెల్స్ దాటాల్సిందే - చాలామంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఈ మూవీ గురించి మీకు తెలుసా?