Horror Movies On OTT: స్వర్గానికి వెళ్లాలని కోరుకుంటూ పూజలు చేసే మనుషులు చూసే ఉంటాం. కానీ నరకానికి వెళ్లాలని, అందుకోసం రిస్కులు తీసుకునే మనుషులను చూసుంటారా? అలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే ‘ఆంట్రమ్’ (Antrum). నరకానికి 5 లెవెల్స్ ఉంటాయని, మనం కోరుకుంటే దెయ్యాలు ముందుకొచ్చి ఆ నరకానికి మనల్ని తీసుకెళ్లి నరరూప రాక్షసులుగా మార్చేస్తాయనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ఇది.


కథ..


‘ఆంట్రమ్’ కథ విషయానికొస్తే.. ఒరాలీ (నికోల్ టాంప్కిన్స్), నాథన్ (రోవన్ స్మిథ్) అక్కాతముళ్లు. నాథన్.. తన పెట్ డాగ్ చనిపోయిందని చాలా డిప్రెషన్‌లో ఉంటాడు. అంతే కాకుండా తనకు కలలో బాఫోమెట్ కనిపిస్తుంది. బాఫోమెట్ అంటే మేక తల ఉన్న రాక్షసి విగ్రహం. ఆ విగ్రహాన్ని గిరిజనులు దేవుడిలాగా భావిస్తారు, పూజిస్తారు. కానీ మిగతావారికి మాత్రం చూడడానికి అది చాలా భయంకరంగా ఉంటుంది. నాథన్‌కు అది కలలో రాగానే ఉలిక్కిపడి లేస్తాడు. దీంతో తన తమ్ముడిని అలా చూడలేక పెట్‌ను నరకం నుంచి తీసుకొస్తానని మాటిస్తుంది ఒరాలీ. మరుసటి రోజు నరకానికి ఎలా వెళ్లాలో చెప్పే ఒక పుస్తకాన్ని తీసుకొని నాథన్, ఒరాలీ అడవిలోకి వెళ్తారు. ‘ఈ అడవిలోకి వచ్చినవాళ్లు తిరిగి వెళ్లలేరు’ అని అక్కడ చెట్టుపై రాసుంటుంది. అయినా వాళ్లు పట్టించుకోరు. ముందుగా నరకానికి వెళ్లడం కోసం ఒక నక్షత్రాన్ని గీసి అందులో ప్రతీ మూల ఒక దేవుడి విగ్రహం పెడతారు. 


ఆ తర్వాత నాథన్, ఒరాలీ ఒక గొయ్యిను తవ్వడం మొదలుపెడతారు. అప్పుడే దూరంగా నాథన్‌కు ఒక నల్ల ఆకారం కనిపిస్తుంది. అంతే కాకుండా గొయ్యిలో నుంచి ఒక శబ్దం కూడా వినిపిస్తుంది. మరుసటి రోజు కూడా గొయ్యి తవ్వుతున్నప్పుడు ఆ ఆకారాన్ని చూడడంతో నాథన్ గట్టిగా అరుస్తాడు. ఒరాలీ మాత్రం అప్పటికీ దెయ్యాలు ఉన్నాయని నమ్మదు. అందుకే తన తమ్ముడికి సర్దిచెప్పి తీసుకెళ్తుంది. తన తమ్ముడిని భయపెట్టడం కోసం మూడు తలలు ఉన్న కుక్క కథ చెప్తుంది. అదే రోజు రాత్రి మళ్లీ నాథన్‌కు కల వస్తుంది. అందులో బాఫోమెట్‌తో పాటు నరరూప రాక్షసులు కనిపిస్తారు. మరుసటి రోజు మళ్లీ నరకాన్ని వెతుక్కుంటూ వెళ్తారు నాథన్, ఒరాలీ. అదే సమయంలో నాథన్‌కు కలలో కనిపించిన నరరూప రాక్షసులు వారికి కనిపిస్తారు. వారిని బంధిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెరపై చూడాల్సిన కథ.



డిఫరెంట్ హారర్..


నరకానికి 5 లెవెల్స్ అనేది అసలు ఎక్కడా ఎవరూ వినుండరు. అలాంటి ఒక డిఫరెంట్ కథతో తెరకెక్కిన చిత్రం కావడంతో ‘ఆంట్రమ్’పై ముందుగానే ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తిని చివరివరకు మెయింటేయిన్ చేయగలిగాడు దర్శకుడు. 1979లో తెరకెక్కిన ఈ చిత్రం.. 60 మందికిపైగా ప్రాణాలు పోవడానికి కారణమని ట్రైలర్‌లో మేకర్స్ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చివరిగా 2018లో విడుదయిన ‘ఆంట్రమ్’కు ‘ది డెడ్లియెస్ట్ ఫిల్మ్ ఎవర్ మేడ్’ అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. ఇలాంటి ఒక డిఫరెంట్ హారర్ మూవీని చూడాలంటే యాపిల్ టీవీ ప్లస్‌లో ఉన్న ‘ఆంట్రమ్’ను ట్రై చేయండి.


Also Read: గతం, భవిష్యత్తును కలిపిన ఒక ఫోన్ కాల్ - వరుస హత్యలను ఆపగలదా? ట్విస్టులతో మతిపోగొట్టే సినిమా!