Mexico Crime:
మెక్సికోలో దారుణం..
మెక్సికోలోని ఓ లోయలో దొరికిన 45 బ్యాగ్‌లు సంచలనం రేపుతున్నాయి. అన్ని బ్యాగ్‌ల్లో శరీర భాగాలున్నాయి. దారుణంగా హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా నరికి వాటిని ఇలా 45 సంచుల్లో ఉంచారు. గత వారమే 7గురు యువకులు కనిపించకుండా పోయారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఇందులో భాగంగానే పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఉన్నట్టుండి నల్ల సంచులు కనిపించాయి. అనుమానాస్పదంగా కనిపించడం వల్ల వెంటనే వాటిని బయటకు తీసి చూశారు. షాక్ అయ్యారు. అన్ని సంచుల్లోనూ శరీర భాగాలు కనిపించాయి. పురుషులతో పాటు, మహిళల శరీర భాగాలు కూడా అందులో ఉన్నట్టు వెల్లడించారు. జపోపన్ ఏరియాలో సెర్చ్ చేస్తుండగా ఈ బ్యాగ్‌లు దొరికినట్టు వివరించారు. ఐదుగురు పురుషులతో పాటు ఇద్దరు మహిళలు గత వారం నుంచి కనిపించడం లేదు. ఉన్నట్టుండి అదృశ్యం అవడం వాళ్ల కుటుంబ సభ్యుల్ని ఆందోళనకు గురి చేసింది. అయితే...ప్రస్తుతం దొరికిన శరీర భాగాలు.. కనిపించకుండా పోయిన వ్యక్తులవేనా..? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. మిస్ అయిన వాళ్లంతా వేరు వేరు రోజుల్లో అదృశ్యమయ్యారని పోలీసులు వెల్లడించారు. కానీ...వాళ్లు ఒకే కాల్‌సెంటర్‌లో పని చేస్తున్నట్టు తెలిపారు.
నేరాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మెక్సికో..
ఈ కాల్ సెంటర్ ఉన్న చోటే శరీర భాగాలున్న సంచులు దొరకడం మరింత కలవర పెడుతోంది. ఫోరెన్సిక్ టీమ్ ప్రస్తుతం ఆ శరీర భాగాలు ఎవరివి అని విచారిస్తున్నారు. అయితే...ఈ కాల్ సెంటర్‌పైనే అందరికీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని స్థానికులు గతంలోనే కంప్లెయింట్ చేశారు. పైగా...ఈ కాల్‌సెంటర్‌లో ఓ క్లాత్‌తో పాటు రక్తపు మరకలు కూడా కనిపించాయని స్థానిక మీడియా వెల్లడించింది. ఇప్పుడే కాదు. ఈ మధ్య కాలంలో జలిస్కో ప్రాంతంలోనూ ఇలానే బ్యాగ్‌లలో శరీర భాగాలు కనిపించాయి. 2021లో 11 మందికి చెందిన 70 శరీర భాగాల్ని సంచుల్లో కుక్కి పెట్టారు దుండగులు. అంతకు ముందు 2019లో 29 మందికి చెందిన శరీర భాగాలను 119 సంచుల్లో ప్యాక్ చేశారు. ఈ ఏడాది మొదలైన మొదటి రెండు నెలల్లోనే ఇలాంటి దారుణాలు చాలా జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. 33 మంది ఇలానే హత్యకు గురయ్యారని అంటున్నారు. మెక్సికోలో నేరాలు దారుణంగా పెరుగుతున్నాయనడానికి ఇవే ఉదాహరణలు. ఇప్పటి వరకూ ఇక్కడ 3 లక్షల 40 వేల హత్యలు జరిగాయి. దాదాపు లక్ష మంది అదృశ్యమయ్యారు.