Rahul Gandhi US Visit: 


అమెరికా పర్యటనలో రాహుల్..


కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడి ప్రత్యేక సమావేశాల్లో పాల్గొంటున్న ఆయన...ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. అటు మోదీ సర్కార్‌నీ ఘాటుగానే విమర్శిస్తున్నారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆ తరవాత రాహుల్ వెళ్లిన తొలి విదేశ పర్యటన ఇదే. ఈ క్రమంలోనే 2024 ఎన్నికలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలన్నీ ఒక్కటైతే బీజేపీని ఓడించడం సులువేనని గతంలో చెప్పిన రాహుల్...ఇప్పుడు ఆ ఎన్నికల ఫలితాల జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగ్గా రాణిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వాషింగ్టన్‌లోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లో జర్నలిస్ట్‌లతో ముచ్చటించారు రాహుల్. 


"ప్రతిపక్షాలు ఒక్కటైతే బీజేపీని ఓడించొచ్చు. ఇక మా పార్టీ విషయానికొస్తే...వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా రాణిస్తుంది. ప్రజలంతా ఆశ్చర్యపోయే స్థాయిలో ఫలితాలుంటాయ్. అన్ని పార్టీలు కలిసొస్తే బీజేపీని ఢీకొట్టడం సులువవుతుంది. అందుకే మా పార్టీ తరచూ ప్రతిపక్షాలతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతానికి అందరూ ఒకేతాటిపై ఉన్నారు. ఐడియాలజీ పంచుకుంటున్నారు. అయితే...ఒక్కో పార్టీకి ఒక్కో సిద్ధాంతం ఉంటుంది. వాటన్నింటినీ అర్థం చేసుకోవాల్సి ఉంది. కాస్త పట్టు విడుపులూ అవసరమే. కానీ...కచ్చితంగా ఈ ఐక్యత బీజేపీని ఓడిస్తుందన్న నమ్మకం ఉంది"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత 


కొన్ని కీలక సంస్థల్ని కేంద్రం తన చేతిలో కీలుబొమ్మలుగా మార్చుకుంటోందని మండి పడ్డారు రాహుల్ గాంధీ. దీనిపై ప్రశ్నించినా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తనపై అనర్హతా వేటు పడడాన్నీ మరోసారి ప్రస్తావించారు. తనకు ఇదే అడ్వాంటేజ్‌గా మారిందని వెల్లడించారు. 


"నాపై అనర్హతా వేటు వేశారు. అయినా నాకు దీని వల్ల లాభమే జరిగింది. నన్ను నేను మార్చుకునేందుకు అవకాశం దొరికింది. నిజానికి..ఇది బీజేపీ నాకిచ్చిన గిఫ్ట్‌ అనే భావిస్తున్నా. వాళ్లకు ఇది అర్థం కాకపోవచ్చు కానీ...జరిగింది అదే. కొన్ని సార్లు నాకు హత్యా బెదిరింపులూ వచ్చాయి. వాటినెప్పుడూ పట్టించుకోలేదు. అందరూ ఎప్పుడో అప్పుడు చనిపోవాల్సిందే. ఏం జరిగినా వెనక్కి తగ్గను. మా నానమ్మ, నాన్న నుంచి ఇదే నేర్చుకున్నా"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత 


పెగాసస్‌పై కామెంట్స్..


వాషింగ్టన్‌లో వ్యాపారవేత్తలతో సమావేశమైన ఆయన...మళ్లీ పెగాసస్‌ వైరస్‌ ప్రస్తావన తీసుకొచ్చారు. తన ఫోన్ ట్యాపింగ్‌కి గురవుతోందని తెలిసినా ఏమీ చేయలేకపోయానని స్పష్టం చేశారు. స్టార్టప్‌ల ప్రతినిధులతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్స్‌తో మాట్లాడిన రాహుల్....ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో పాటు కొత్త టెక్నాలజీల గురించి ప్రస్తావించారు. డేటాని గోల్డ్‌తో పోల్చిన ఆయన..ఇండియా ఈ విషయంలో ఎంతో సామర్థ్యాన్ని సాధించిందని తెలిపారు. ఇదే సమావేశంలో బిగ్‌డేటా,మెషీన్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్స్‌తోనూ చర్చించారు. డేటా భద్రత విషయంలో కొన్ని లొసుగులున్నాయని, కేంద్రం వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. డేటా ప్రొటెక్షన్‌కి కచ్చితమైన నిబంధనల అవసరముందని అభిప్రాయపడ్డారు. 


Also Read: Pankaja Munde: నేను బీజేపీలో ఉన్నాను, కానీ ఇది నా పార్టీ కాదు: మహారాష్ట్ర మాజీ మంత్రి పంకజా ముండే