గంజాయి అక్రమ రవాణా చేయటంతో పాటుగా మత్తు పదార్థాల వినియోగాన్ని ప్రోత్సహించే వారి పై పోలీసులు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. మత్తు పదార్దాల వినియోగం వలన జరిగే నష్టాలను గురించి వివరిస్తూ అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు.


సండే క్లాస్ లు...
గంజాయి మత్తు పదార్దాలు రవాణా చేస్తూ వాటిని వినియోగిస్తున్న వారికి ఏపీ పోలీసులు ప్రత్యేక క్లాస్ తీసుకుంటున్నారు. ప్రతి ఆదివారం గతంలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ను నిర్వహించే పోలీసులు, ఇప్పుడు మత్తు పదార్థాలు రవాణా చేసే వారిని టార్గెట్ చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్లను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చే పోలీసులు, గంజాయి రవాణా చేసే వారిని జోన్ల వారీగా విభజించారు. వారందనిని ఆయా జోన్ ల పరిధిలోని కౌన్సిలింగ్ సెంటర్లకు పిలిచి క్లాస్ తీసుకుంటున్నారు. నిందితులు ఎవరిపై ఎన్ని కేసులు ఉన్నాయి, వాటి తీరు ఏ స్దాయిలో ఉంది, శిక్షపడిన వారి జీవితాలపై పడిన ప్రభావం ఎంటి వంటి విషయాలను పోలీసులు వాకబు చేస్తున్నారు. అంతే కాదు వారిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా క్లాస్ తీసుకుంటున్నారు. ఎన్.టి.ఆర్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీస్ వారి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలను సేవించే వారికి వాటి వాడకం వలన కలిగే నష్టాలపై అవగాహనా కార్యక్రమం జరిగింది. ఎన్.టి.ఆర్ జిల్లా నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు ఎన్.టి.ఆర్ జిల్లా టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం, గంజాయి అక్రమ రవాణా కేసులలో, మత్తు పదార్థాలు తీసుకుంటూ అరెస్టయిన వారిపై  కేవలం చట్టపరమైన చర్యలే కాకుండా వారిలో సమూలమైన మార్పులు తీసుకు వచ్చే ప్రయత్నంలో బాగంగా CTF వారి ఆధ్వర్యంలో  కౌన్సిలింగ్  కార్యక్రమం నిర్వహించారు.


జనవరి 29న టాస్క్ ఫోర్సు కార్యాలయంలో నగరంలో గంజాయి సేవిస్తూ అరెస్టయిన 100 మంది యువకులను వారి తల్లిదండ్రుల సమక్షంలో వారికి గంజాయి, ఇతర మాదకద్రవ్యాల బారిన పడితే కలిగే అనర్థాలు- ఎన్.డి.పి.ఎస్. చట్టం గురించి తెలియజేస్తూ వారిని మంచి మార్గంలో నడిపించే దిశగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో టాస్క్ ఫోర్సు ఏ.సి.పి.  రమణమూర్తి మాట్లాడుతూ..... మాదకద్రవ్యాల వల్ల జరిగే నష్టాలను గురించి అవగాహన కలిగించడంతోపాటు ఎన్.డి.పి.ఎస్. చట్టం గురించి అందులోని శిక్షల గురించి పూర్తిగా తెలియజేశారు.  ప్రపంచ మానవాళి పురోభివృద్ధికి పెనుభూతమైన గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వలన యువత యొక్క ఆరోగ్యానికి కలిగే నష్టాలను గురించి, భవిష్యత్తులో ఏవిధంగా వారి జీవితాలు పాడవుతాయనే అంశంపై యువకులకు అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ ప్రభావం వలన తల్లిదండ్రులు కష్టపడి చదివించి గొప్పవాళ్ళను చేయాలనుకున్న ఆశలు అడియాశలవుతున్నాయని,వాటి బారిన పడితే భవిష్యత్తు అంధకారం అవుతుందని సూచించారు.


ముందు కౌన్సిలింగ్... అయినా మారకుంటే...
గంజాయి మరియు ఇతర మత్తు పదార్ధాల బారిన పడిన యువకులు సత్ ప్రవర్తన మార్గంలో నడుచుకోవడానికి ఈ కౌన్సిలింగ్ కార్యక్రమం మంచి మార్గమని అయినా మార్పు రాకుండా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చెడు వ్యసనాలను దూరం చేసుకుని మంచి ప్రవర్తనతో మెలగాలని లేని పక్షంలో చట్టాన్ని పూర్తి స్దాయిలో అమలు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కౌన్సిలింగ్ లలో కూడా మాదక ద్రవ్యాల అలవాటు మానుకోలేని వారిని డి అడిక్షన్ సెంటర్లకు పంపి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు తెలియజేశారు.అంతే కాకుండా గంజాయి అమ్మే వ్యక్తులపై చట్టపరమైన  కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని హెచ్చరించారు.