Nizamabad News : నిజామాబాద్ నగరంలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరంతా ఆదిలాబాద్ జిల్లా వాసులుగా తెలుస్తోంది. మృతులు సూర్యప్రకాష్, అక్షయ, ప్రత్యుష, అద్వైత్ లుగా పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ నగరంలోని ఓ హోటల్ నలుగురు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తండ్రి సూర్యప్రకాష్ పిల్లలకు భార్యకు ఉరివేసి అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యప్రకాష్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వీరు 15 రోజులుగా నిజామాబాద్ నగరంలోని కపిల హోటల్ లో రూమ్ బుక్ చేసుకొని ఉంటున్నారు. నిన్న రాత్రి వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకున్న చోట సూసైడ్ నోట్ దొరికింది. సూసైడ్ నోట్ లో ఏముందన్నది ఇంకా పోలీసులు వివరాలు వెల్లడించలేదు.
దళిత యువకుడు ఆత్మహత్య
నెల్లూరు జిల్లా కావలిలో రాజకీయాలకు ఓ దళిత యువకుడు బలయ్యాడు. స్థానిక రాజకీయ నాయకుల వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. పలువురు రాజకీయ నాయకుల కారణంగానే తాను చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ అతడు రాసిన మరణ వాంగ్మూలం కలకలం రేపుతోంది. మరోవైపు.... దళితులు మరణించిన తర్వాత కూడా వివక్షకు గురవుతూనే ఉన్న పరిస్థితులు ఆవేదన కలిగిస్తున్నాయి. హిందూపురం నియోజకవర్గంలో దళిత వర్గానికి చెందిన ఓ వ్యక్తి మరణిస్తే ఖననం చేయకుండా అడ్డుకున్నారు కొెెందరు వ్యక్తులు. ఏళ్లుగా ఇదే సమస్య ఎదురవుతున్నా అధికారులు పరిష్కారం చూపకపోవడం పట్ల బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నా చావుకి వారే కారణం
నెల్లూరు జిల్లా కావలిలో ముసునూరు హరిజనపాలెంలో నివాసం ఉండే దుగ్గిరాల కరుణాకర్ అనే దళిత యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైసీపీ నేతలు కేతిరెడ్డి జగదీశ్ రెడ్డి, సురేశ్ రెడ్డి తన చావుకి కారణమంటూ సూసైడ్ నోట్ రాసి అతడు ఉరేసుకుని చనిపోయాడు. 20లక్షల రూపాయలు అప్పులు చేసి చెరువులో చేపలు పెంచితే, మూడేళ్లుగా వాటిని పట్టనివ్వడం లేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. తన తల్లి కూడా వైసీపీ నేతల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ కరుణాకర్ సూసైడ్ లెటర్ రాసినట్టు చెబుతున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కావలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మరో ఎస్సీ యువకుడికి ఉరి- చంద్రబాబు
వైసీపీ పాలనలో మరో ఎస్సీ యువకుడికి ఉరి పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు రోజుకొకరు మరణించడం వైసీపీ పాలనలో సర్వసాధారణంగా మారిందని శనివారం ట్విటర్లో ధ్వజమెత్తారు. వీటిపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. ‘కరుణాకర్‌పై జగదీశ్‌రెడ్డి ఆగడాలను జగన్ ముందే అడ్డుకట్ట వేసి ఉంటే మరో ఎస్సీ యువకుడు ప్రాణాలు పోయేవి కాదు. భూదందాలు, సెటిల్‌మెంట్లను దాటిన వైసీపీ వాళ్ల ధనదాహం వ్యక్తుల ప్రాణాలను మింగేస్తోంది. సమాజానికి శత్రువులుగా మారిన వైసీపీ నేతలను కట్టడి చేయడంలో ఆ పార్టీ ఉదాసీనంగానే వ్యవహరిస్తోంది’ అని చంద్రబాబు మండిపడ్డారు.
Also Read : Ramagundam Crime : రామగుండం మర్డర్ కేసులో సంచలనాలు, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
Also Read : సింగరేణిలో పేలిన తుపాకీ- పరుగులు పెడుతున్న పోలీసులు