Ramagundam Crime : రామగుండం మర్డర్ కేసులో పోలీసులు అసలు కారణాలు వెలికితీశారు. ఏకంగా తుపాకీ వాడి ఓ సింగరేణి కార్మికుడిని హత్య చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట పకడ్బందీగా ప్లాన్ వేసి తమ టార్గెట్ ను ఫినిష్ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇంటి లోపల నిద్రిస్తున్న వ్యక్తిని అంత కచ్చితంగా గుర్తించి ఎలా చంపారు? అనే దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.
అసలేం జరిగింది?
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటకు చెందిన రవళితో ఏడేళ్ల క్రితం కొరకు కొప్పుల రాజేందర్ వివాహం జరిగింది. అయితే మొదటి నుంచి రాజేందర్ తో తరచూ గొడవలు పడిన రవళి దూరంగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటామంటూ చెబుతుండేది. అయితే ఆమెకు మరో వ్యక్తితో సాహిత్యం ఉన్నట్లు గుర్తించి పంచాయితీ కూడా నిర్వహించారు. ఈ మధ్య జరిగిన పంచాయితీలో తాను ఇతర భర్త చెప్పినట్లు నడుచుకుంటానని రవళి అంగీకరించింది. తన తల్లిదండ్రులతో కలిసి ఉండడం ఇష్టం లేదంటే వేరు కాపురం పెట్టాడు రాజేందర్. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఉద్యోగం చేస్తున్నాడు రాజేందర్. శ్రీరాంపూర్ ప్రాంతంలో పనిచేస్తూనే భార్యాపిల్లలతో హాయిగా కాలం వెళ్లదీస్తున్నారు. అయితే శుక్రవారం డ్యూటీ ముగించుకొని వచ్చిన రాజేందర్ ఇంట్లో నిద్రించుచుండగా తెల్లవారుజామునే ఇద్దరు వ్యక్తులు రాజేందర్ ని పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు అసలు అంత రాత్రి సమయంలో రాజేందర్ ను గుర్తించడం, ఇంటి తలుపులు ఎవరు తీశారనే అనుమానాలు మొదలయ్యాయి. పకడ్బందీగా ప్లాన్ చేస్తే కానీ పది నిమిషాల్లో ఈ వ్యవహారాన్ని పూర్తి చేయలేరని ఇంటి దొంగల హస్తం ఉంటుందని పోలీసులు అనుమానించారు. రాజేందర్ హత్య చేయడానికి ఏకంగా తుపాకీని వాడడంతో పోలీసులు సైతం ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు. వీధిలోని సీసీ టీవీ కెమెరాలో నిందితులు వచ్చి వెళ్తోన్న విజువల్స్ చాలా స్పష్టంగా కనిపించాయి. హెల్మెట్ పెట్టుకుని గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యారని రవళి పోలీసులకు చెప్పింది. అన్నీ విన్న పోలీసులు దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటకు వచ్చింది.
మూడో ప్రయత్నంలో భర్తను చంపిన రవళి
రవళితో పాటు రాజేందర్ తల్లిదండ్రులను సైతం విచారించిన పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు తెలిశాయి. అమాయకంగా కనిపించే ఆమె ఒక క్రిమినల్ కి ఏ మాత్రం తీసిపోకుండా రాజేందర్ ని చంపించడానికి ప్లాన్ వేసింది. ఒకసారి తమ ఇంట్లో గేట్ కి కరెంట్ పాస్ అయ్యిందని, అప్పుడు రాజేందర్ కు షాక్ కొట్టిందని దీని వెనకాల రవళి కుట్ర ఉందని రాజేందర్ తల్లిదండ్రులు అనుమానించారు. అయితే అప్పట్లో వారి మాటలు ఎవరు పట్టించుకోలేదు. ఈ మధ్య రాజేందర్ ను ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. చంపించాలని ప్లాన్ చేసిందని, అయితే అది కూడా విఫలం కావడంతో తమ కుమారుడు బతికి బయటపడ్డాడని రాజేందర్ తల్లిదండ్రులు అంటున్నారు. రెండు సార్లు విఫలమవ్వడంతో ఎట్టిపరిస్థితుల్లో అతని ప్రాణం తీయాలని భావించిన రవళి తన ప్రియుడు రాజు అతని మిత్రుడు సయ్యద్ లతో కలిసి ఒక ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే తుపాకీతో కాల్చి చంపితే రాజేందర్ బతికి బట్ట కట్టే అవకాశం లేదని వారికి వివరించడంతో బిహార్ నుంచి తుపాకిని కొనుగోలు చేశారు. ఇక హత్య చేసిన రోజు రాత్రి తలుపు తీసి ఉండడంతో నేరుగా వచ్చిన దుండగులు రాజేందర్ తలపై గురి పెట్టి మరి కాల్చారు. దీంతో అక్కడికక్కడే రక్తం మడుగులో రాజేందర్ ప్రాణాలు కోల్పోయాడు.
Also Read : శిల్పకళావేదికలో మునావర్ స్టాండప్ కామెడీ- బయట బీజేపీ శ్రేణులతో హైటెన్షన్
Also Read : సింగరేణిలో పేలిన తుపాకీ- పరుగులు పెడుతున్న పోలీసులు