Munnuru Kapu As Bc D: ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న మున్నూరు కాపు వర్గీయులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మున్నూరు కాపులను బీసీ జాబితాలో చేరుస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మున్నూరు కాపు కులస్తులను బీసీ-డీ కింద ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు శనివారం రోజు మున్నూరు కాపులకు బీసీ - డీ కింద కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా షేషు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఇటీవలే వరద ప్రాంతాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు మున్నూరు కాపులు వినతి పత్రం ఇచ్చారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ రెడ్డి... బీసీ - డీ సర్టిఫికేట్ ఇచ్చేందుకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే శనివారం మున్నూరు కాపులకు బీసీ - డీ ధ్రువ పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 


తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మున్నూరు కాపులు బీసీ కోటాలోనే కొనసాగుతున్నారు. చాలా కాలంగా తెలంగాణలో మున్నురు కాపులను బీసీలుగానే గుర్తిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం మున్నూరు కాపులను అగ్రకులస్థులగా చూస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోనూ మున్నూరు కాపులను బీసీ కోటాలోనే చేర్చాలన్న డిమాండ్ చాలా రోజులుగా ఉంది. ఎప్పటి నుండో ఉన్న ఈ డిమాండ్ పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. స్థానిక నాయకులు హామీలు ఇస్తున్నప్పటికీ ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ప్రతిపాదనలు స్వీకరించలేదు. ఈ క్రమంలోనే మున్నూరు కాపుల ఆశలను, ఆకాంక్షలను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారి కోరికను నెరవేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. మున్నూరు కాపులను బీసీ డీ జాబితాలో అధికారికంగా చేర్చారు. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  మున్నూరు కాపులకు బీసీ - డీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. 


7 మండలాల మున్నూరు కాపులకు..


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సమయంలో తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేశారు. అయితే ఈ ప్రాంతాల్లో ఉండే మున్నూరు కాపులను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత కాలం వారిని బీసీలుగానే గుర్తించారు. బీసీలు పొందే ప్రయోజనాలే వారూ పొందారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లూ మున్నూరు కాపులకు అందాయి. కాలేజీలు, విశ్వ విద్యాలయాల్లో బీసీ రిజర్వేషన్లు పొందారు. ఎప్పుడైతే ఆయా ఏడు మండలాలను ఏపీలో కలిపారో.. అక్కడి మున్నూరు కాపులు ఓసీలుగా మారిపోయారు. ముందు పొందిన ప్రయోజనాలు లేకుండా పోయాయి. ముందు పొందిన రిజర్వేషన్లు రావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో, కాలేజీ సీట్లు పొందడంలో, విశ్వ విద్యాలయం సీట్లు పొందడంలోనూ రిజర్వేషన్లు అమలు కావడం లేదు. ఇలాంటి కారణాల వల్ల ఆయా మండలాల్లోని మున్నూరు కాపులు తమను బీసీ లుగా గుర్తించాలని చాలా కాలంగా కోరుతున్నారు. 


Also Read : Nellore News : నెల్లూరు సిటీలో రసవత్తర రాజకీయం, మాజీ మంత్రి అనిల్ ఇలాకాలో వేరు కుంపటి


Also Read : AP Politics: నన్ను టార్గెట్ చేశారు, నాపై కుట్ర జరుగుతోంది - మాజీ మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు