CJI Justice NV Ramana: గుంటూరు జిల్లాలోని ఆచార నాగార్జున యూనివర్సిటీ 37, 38 వ స్నాతకోత్సవం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ హాజరయ్యారు. ఈ క్రమంలో జస్టిస్ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. వర్సిటీ ఛాన్స్ లర్ హోదాలో గవర్నర్ బిశ్వభూషణ్, వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ తో పాటు విద్యా శాఖ మంత్రి బొత్స సత్య నారాయణ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పలు విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలతో పాటు పట్టాలను బహుకరించారు. 


ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ... తాను చదివిన యూనివర్శిటీ నుంచే గౌరవ డాక్టరేట్ పొందండం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అచారార్య నాగార్జున సిద్ధాంతాల స్ఫూర్తితో యూనివర్సిటీ స్థాపించారని అన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా నాగార్జున యూనివర్శిటీ విద్యా రంగానికి ఎన్నో సేవలు అందించిందని వివరించారు. అన్ని రకాల అసమానతలు తొలగాలంటే విద్యా రంగమే కీలకమని చెప్పారు. ఎంతో మేథో మధనం తర్వాత 2009లో విద్యా హక్కు చట్టం వచ్చిందన్నారు. హ్యుమానిటీ, చరిత్ర వంటి సబ్జెక్టులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. హోలిస్టిక్ విద్యా విధానం ఉన్నప్పుడే సర్వతోముఖాభివృద్ధి సాధ్యం అవుతుందని వివరించారు. ఈ యూనివర్శిటీలో ఉన్న ఎంప్లాయీస్ అసోసియేషన్ కారణంగానే నేను ఇక్కడ చేరానని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. అసోసియేషన్ నేతలు వచ్చి పట్టు పట్టడంతో లా స్టూడెంటుగా చేరానని చెప్పారు. 


క్యాంటీనే మా అడ్డా.. అక్కడే అన్ని విషయాలపై చర్చ!


యూనివర్శిటీలో మా అడ్డా క్యాంటీనే అని చెప్తూ మురిసిపోయారు. అక్కడ కూర్చొనే అనేక విషయాలపై చర్చించే వాళ్లమని అన్నారు. లా కాలేజీ వల్ల మిగిలిన విద్యార్ధులు చెడిపోతున్నారని.. మా కాలేజీని తరలించాలనే ప్రతిపాదన జరిగిందన్నారు. నాడు వివిధ అంశాలపై యువతలో జరిగిన చర్చ ఇప్పుడు జరగడం లేదన్నారు. సమస్యలపై యువత స్పందించకపోవడం సమాజానికి మంచిది కాదని... జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా విద్యా విధానం ఉండాలని అన్నారు. యూనివర్శిటీలు రీసెర్చ్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని సూచించారు. రీసెర్చ్ వింగ్ కోసం యూనివర్శిటీలు కూడా  అవసరమైన మేరకు బడ్జెట్ కేటాయింపులు జరపాలన్నారు. సమాజం కోసం.. సమాజ అవసరాల కోసం పౌరులను తయారు చేసేలా విద్యా విధానం ఉండాలని వివరించారు. యూనినర్శిటీకి అవసరమైన నిధులిచ్చేలా మంత్రి బొత్స చొరవ తీసుకుంటారని చెప్పారు. మంత్రి బొత్స దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నారంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు.


తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే విద్యార్థులకు మార్గదర్శకులు..


ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆలోచనాత్మకమైన సంప్రదాయాన్ని అమలు చేసిందని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తెలిపారు. జస్టిస్ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ డిగ్రీని ప్రదానం చేసిందని.. విద్యార్ధుల కల నెరవేరినందుకు గర్వించదగిన క్షణం ఇదని వివరించారు. విద్యార్ధుల తల్లి దండ్రులు, ఉపాధ్యాయులే వారికి గైడ్‌లు, మార్గదర్శకులని చెప్పారు. వీళ్లే విద్యార్థుల జీవితంలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. ఉన్నత విద్యా సంస్థగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 46 ఏళ్ల నుంచి సుదీర్ఘ ప్రయాణం చేస్తోందని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సందర్భంలో దేశాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలన్నారు. నేతాజీ, గాంధీజీ ఆశయాలను నేరవేర్చాలని... స్వాంతంత్ర్య సమర యోధుల త్యాగాలను స్మరించుకోవాలని విద్యార్థులకు సూచించారు. జాతీయ పతాక రూప శిల్పి పింగళి వెంకయ్య.. మనకు గర్వ కారణం అన్నారు.