నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బేతల సరస్వతి (35) ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలు గత కొద్ది రోజులుగా మానసికంగా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మండలంలోని రహత్ నగర్ లో టీచర్ గా పనిచేస్తున్న సరస్వతికి ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో ప్రకారం కామారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యింది. బదిలీ కావడంతో జాయినింగ్ రిపోర్ట్ కూడా అందించారు. బదిలీపై వేరే జిల్లాకు వెళ్లాలని మానసిక క్షోభతో ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో సరస్వతి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమెను కుటుంబ సభ్యులు ఆర్మూర్ లోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త బేతల భూమేష్ ఉపాధి నిమిత్తం ఖతర్ లో ఉంటున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. టీచర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారి స్వామి ఆర్మూర్ దావఖానాకు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ఉపాధ్యాయురాలు మృతికి మానసిక బాధ కారణమా, బదిలీ అంశమా విచారణలో తెలియాల్సి ఉంది. 


Also Read: 'ఇక ధర్మ యుద్ధం స్టార్ట్ అయింది'.. కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ విడుదల


గుండెపోటుతో ఉపాధ్యాయురాలు మృతి..
 
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎడిజర్ల  శివారు పుసాలి తండాలో  గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పి.శ్రీమతి (42) మృతి చెందారు. మహబూబాబాద్ లో  విధులు నిర్వహిస్తున్న   శ్రీమతికి ప్రభుత్వం ఏటూరునాగారం మండలానికి పోస్టింగ్ ఇచ్చారు. దీంతో గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం మనస్తాపానికి గురై  గుండె నొప్పితో మృతి చెందారు. ఈ ఘటనపై ఉపాధ్యాయ, ఉద్యోగులు మండిపడుతున్నారు. 317 జీవో వలన ఉద్యోగుల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటికే ఒక ఉపాధ్యాయుడు మృతి చెందగా తాజాగా మరో ఉపాధ్యాయురాలు చనిపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 



Also Read: హైకోర్టులో బండి సంజయ్ కి ఊరట.. వెంటనే విడుదల చేయాలని ఆదేశం


అసలేంటీ జీవో 317..?


2021 డిసెంబర్ 6న ప్రభుత్వం 317 జీవోను జారీ చేసింది. పాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలోని ఉద్యోగులు, ఆ పాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల పరిధిలోని కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, కొత్త మల్టీ జోన్లలో కోరుకున్న చోటుకు వెళ్లటానికి ఆప్షన్ ఎంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ ఆప్షన్లకు సీనియారిటీని ప్రాతిపదికగా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే వికలాంగులు, వితంతువులు, క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్యాలు ఉన్న వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఆప్షన్లు ఇచ్చింది. ఉద్యోగులు సీనియారిటీ ప్రకారం తాము కోరుకున్న జిల్లాను ఆప్షన్‌గా ఎంచుకోవాలి. ఉద్యోగులు ఇచ్చిన ప్రాధాన్యత ప్రకారం ఆయా జిల్లాల్లో ఉన్న ఖాళీల మేరకు బదిలీ ఉత్తర్వులు ఇస్తారు. డిమాండ్ ఉన్న ప్రాంతంలో ఖాళీలు పూర్తైతే సీనియారిటీ తక్కువగా ఉన్న వారికి ఆప్షన్ ఉండదు. దీంతో వారు కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్ లభించదు. తమ స్థానిక జిల్లా కాకపోయినా వేరే జిల్లాకు శాశ్వతంగా వెళ్లాల్సిఉంటుంది.


Also Read: టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు గోరి కడతారు... ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారు... హన్మకొండ సభలో బీజేపీ నేతలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి