Nizamabad News : నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో వైద్య విద్యార్థిని శ్వేత శుక్రవారం మృతి చెందింది. గురువారం రాత్రి విధులు నిర్వర్తించిన ఆమె, ఉదయం విగతజీవిగా పడిఉంది. దీంతో శ్వేత మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పీజీ రెండో సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థిని శ్వేత నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిద్రపోయిన చోటనే మృతి చెందడం తోటి వైద్య విద్యార్థినులను విస్మయానికి గురి చేస్తోంది. గైనకాలజీలో పీజీ చేస్తున్న శ్వేత శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందింది. గుండెపోటుతో మరణించి ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. రాత్రి రెండు గంటల వరకు శ్వేత డ్యూటీ లోనే ఉన్నట్లు వైద్య విద్యార్థినులు, వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు.


వాష్ రూమ్ లో స్పృహ లేని స్థితిలో 


విశ్రాంతి గదిలో పడుకున్న శ్వేత ఉదయం లేవకపోవడంతో ఆసుపత్రిలో తోటి విద్యార్థులు షాక్ కు గురయ్యారు. నిజామాబాద్ జీజీహెచ్ లో గైనిక్ వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. వైద్య కళాశాల అనుబంధ జనరల్ ఆసుపత్రిలో చాలా వైద్యసేవలు అందించడంలో పీజీ విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తున్నారు. తీవ్ర ఒత్తిడే శ్వేత మరణానికి కారణం కావొచ్చని పలువురు అనుమానిస్తు్న్నారు. శ్వేత కరీంనగర్ వాసి అని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మరణానికి గల కారణాలపై విచారణ చేపడుతున్నారు. శ్వేత కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇవ్వడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. గైనిక్ వార్డులో పనిచేస్తున్న శ్వేత వాష్ రూమ్ కి వెళ్లి ఎంతకి రాకపోవటంతో అనుమానం వచ్చిన స్వేత స్నేహితులు వాష్ రూమ్ కి వెళ్లి చూడగా అక్కడ స్పృహ కోల్పోయి పడిఉందని, ఆమెను తీసుకొచ్చి బెడ్ పై పడుకోబెట్టామని తోటి డాక్టర్లు తెలిపారు.


గతంలో రెండు సార్లు కరోనా 


శ్వేత చాలా యాక్టివ్‌ గా ఉండేదని తోటి వైద్యులు అంటున్నారు. అలాంటి శ్వేత ఉన్నట్టుండి కుప్పకూలిపోయిందని తెలిపారు. తోటి విద్యార్థులు స్పందించేలోపు ప్రాణాలు కోల్పోయిందన్నారు. అర్ధరాత్రి 2 గంటల వరకు గైనిక్‌ వార్డులో విధులు నిర్వహించిన శ్వేత, విధులు ముగించుకుని విశ్రాంతి తీసుకోడానికి తన గదికి వెళ్లిపోయింది. అంతలో అక్కడే కుప్పకూలింది. కంగారుపడిన స్నేహితులు ఆమెను లేపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. శ్వేతకు గతంలో రెండు సార్లు కరోనా సోకినట్లు తెలుస్తోంది. అయితే కరోనా కారణంగా వచ్చిన ఆరోగ్య సమస్యలతో మరణించి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్ కారణంగా శ్వేతకు గుండె పోటు వచ్చి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. కళాశాల సూపరింటెండెంట్‌ ప్రతిమరాజు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థిని శ్వేత అనుమానాస్పద మృతి సమాచారం అందుకున్న డీసీపీ వినీత్ జిల్లా ఆసుపత్రిలో ఆమె మృతదేహన్ని పరిశీలించారు. ఈ ఘటనపై 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మృతిపై విచారణ చేస్తున్నామన్న డీసీపీ తెలిపారు. కార్డియక్ అరెస్ట్ గా నిర్ధారణకు వచ్చామన్నారు. పోస్ట్ మార్టం అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు.