Nirmal Man Died In A Bus Accident In Uttarpradesh: తెలంగాణవాసుల విహారయాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి కాశీ యాత్రకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు మంగళవారం యూపీ మధుర - బృందావన్‌లో ఘోర ప్రమాదానికి గురైంది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగగా.. ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. మృతుడిని నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సికి చెందిన శీలం దుర్పత్తిగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. పల్సి గ్రామానికి చెందిన 8 మంది యాత్రకు వెళ్లారు.
మంటలు చెలరేగే సమయంలో డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో అంతా వెంటనే దిగిపోయారు. ఈ క్రమంలోనే డ్రైవర్, దుర్పత్తి అందులో చిక్కుకోగా.. డ్రైవర్ బయటపడ్డాడు. దుర్పత్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. మహా కుంభమేళాలో స్నానం చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. బాధిత ప్రయాణికులకు అన్ని విధాలా సాయం చేస్తామని స్థానిక యంత్రాంగం హామీ ఇచ్చింది.
గ్రామంలో తీవ్ర విషాదం
ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. అటు, యాత్రికులను భైంసా రప్పించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్, ముథోల్ ఎమ్మెల్యే చొరవ చూపారు. అక్కడి కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి.. యాత్రికులను క్షేమంగా స్వగ్రామాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. వారిని ప్రత్యేక వాహనాల్లో భైంసాకు తరలిస్తున్నారు.
Also Read: Crime News: పుప్పాలగూడ డబుల్ మర్డర్ కేసు - మృతులను గుర్తించిన పోలీసులు, దారుణ హత్యలకు కారణం అదేనా?