Police Investigation On Puppalaguda Double Murder Case: రంగారెడ్డి జిల్లా (Rangareddy) నార్సింగ్ పీఎస్ పరిధిలోని పుప్పాలగూడ జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అనంత పద్మనాభ స్వామి ఆలయ గుట్టల వద్ద మంగళవారం యువతీ, యువకుడు దారుణ హత్యకు గురి కాగా.. మృతులను పోలీసులు గుర్తించారు. యువకుడు మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్ కాగా ఇతను హౌస్ కీపింగ్ చేస్తూ నానక్‌రామ్‌గూడలో నివాసం ఉంటున్నాడు. యువతి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందు (25)గా గుర్తించారు. ఈమె ఎల్బీనగర్‌లో నివాసం ఉంటోంది.

అక్రమ సంబంధమే కారణమా.?

కాగా, జంట హత్యలకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. అంకిత్ సాకేత్, బిందు మధ్య గత కొంతకాలంగా పరిచయం ఏర్పడింది. అంకిత్ ఈ నెల 11న బిందును ఎల్బీనగర్ నుంచి నానక్‌రామ్‌గూడకు ఆమెను తన స్నేహితుడి రూంలో ఉంచాడు. ఆ తర్వాతి రోజు ఇద్దరూ కలిసి పుప్పాలగూడ గుట్టల వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఇద్దరూ ఏకాంతంగా గడిపారు. అంకిత్‌కు తెలియకుండా బిందు మరో యువకునితోనూ ప్రేమాయణం సాగించింది. సదరు ప్రియుడు వీరిద్దరూ ఏకాంతంగా ఉండడాన్ని చూసి జీర్ణించుకోలేక బిందుపై దాడి చేశాడు. బండరాళ్లతో మోది ఆమెను హతమార్చాడు.

ఇది చూసిన సాకేత్ భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టగా.. అతనిపై సైతం దాడికి పాల్పడ్డాడు. తన వద్ద ఉన్న కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. హంతకుడి కోసం 3 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. కాగా, హత్యకు గురైన బిందు ఈ నెల 3న అదృశ్యమైనట్లు వనస్థలిపురంలో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అంకిత్ సాకేత్‌పై ఈ నెల 8న గచ్చిబౌలి పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది.

ఇదీ జరిగింది

నార్సింగి పీఎస్ పరధిలోని పుప్పాలగూడలో (Puppalaguda) మంగళవారం ఉదయం గాలిపటాలు ఎగురవేసేందుకు కొందరు వెళ్లారు. ఈ క్రమంలో వారికి పద్మనాభ స్వామి ఆలయం సమీపంలో గుట్టపై ఓ యువతి, యువకుడి మృతదేహాలు కనిపించాయి. దీనిపై వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మృతదేహాలను పరిశీలించారు. యువతీ యువకున్ని కత్తులతో పొడిచి, బండ రాళ్లతో మోది దారుణంగా హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: Hyderabad News: మద్యం మత్తులో చోరీకి యత్నించాడు - పారిపోతూ ఫ్లైఓవర్ పైనుంచి దూకాడు, భాగ్యనగరంలో ఘటన