Loan Apps Threats : ఆన్ లైన్ లో లోన్ తీసుకుని తిరిగి తీర్చే క్రమంలో వడ్డీలు భరించలేక చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా ఆన్ లైన్ లో లోన్ తీసుకున్నవారే కాదు, వారి ఫోన్ లోని కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న ప్రముఖులు కూడా బాధితులుగా మారే అవకాశముందని నెల్లూరు ఘటనతో తేలిపోయింది. మంత్రి అయినా సరే కాల్ చేసి హింసించాలనేది వారి ఆలోచన. మంత్రి గారూ మీ ఫోన్ నెంబర్ షూరిటీగా ఇచ్చి లోన్ తీసుకున్నారు, ఇప్పుడు కట్టనంటున్నారు మీరేం చేస్తారో చేయండి, కావాలంటే వారితో మాట్లాడండి అంటూ నెల్లూరు జిల్లా మంత్రి కాకాణికి కాల్ వచ్చింది. కాకాణి పర్సనల్ నెంబర్ కి దాదాపు 79 కాల్స్ వచ్చాయి. పీఏ ఆ కాల్స్ ని బ్లాక్ చేశారు. వివరాలు మంత్రికి చెప్పారు. అయితే మంత్రి ఈ వ్యవహారాన్ని అక్కడితో వదలాలనుకోలేదు. ఈ విషయంలో అసలు సంగతేంటో తేల్చాలంటూ ఎస్పీ విజయరావుకి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. మంత్రి కాకాణికి వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా వలపన్ని నలుగురిని అరెస్ట్ చేశారు. 


రికవరీ ఏజెంట్లు అరెస్టు 


ఈ కేసుకి సంబంధించి కోల్ మాన్ అనే ఏజెన్సీ తరపున రికవరీ ఏజెంట్లు, స్థానిక ఫైనాన్స్ ఏజెన్సీకి చెందినవారిని కూడా అరెస్ట్ చేశామని చెప్పారు పోలీసులు. నలుగురులో ఒక మహిళ కూడా ఉన్నారు. ఐటీ యాక్ట్ కింద కూడా వీరిపై కేసులు నమోదు చేశామన్నారు. లోన్ తీసుకున్నవారికి ఫోన్ చేయాలి కానీ, వారి ఫోన్ బుక్ లో ఉన్న కాంటాక్ట్స్ అన్నింటికీ ఫోన్లు చేసి బెదిరించడం సరికాదంటున్నారు ఎస్పీ విజయరావు. నెల్లూరు కేసు విషయానికొస్తే లోన్ తీసుకున్న వ్యక్తి ఫోన్ బుక్ లో మంత్రి నెంబర్ లేకపోయినా ఇంటర్నెట్ లో జిల్లాలోని ప్రముఖులు నెంబర్లు సెర్చ్ చేసి, మంత్రికి ఫోన్ చేశారని వివరించారు. 


అన్నింటికీ ఓకే వద్దు 


ఆన్ లైన్ లో లోన్ తీసుకునే సమయంలో ప్రతిదానికీ ఓకే అని చెప్పొద్దని, కాస్త ఆలోచించి లోన్లు తీసుకోవాలని సూచించారు నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు. లోన్లు రికవరీ పేరుతో అప్పు తీసుకున్నవారిని ఫోన్ కాల్స్ ద్వారా కానీ, మరో రూపంలో కానీ వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. లోన్ రికవరీ ఏజెంట్ల వద్ద సిమ్ కార్డ్ లు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాటి ద్వారా మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. 


అసలేం జరిగింది? 


అశోక్ కుమార్ అనే వ్యక్తి నెల్లూరులోని పులర్టన్ కంపెనీలో ఎనిమిదిన్నర లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడు. రుణం తీసుకునే ప్రాసెస్ లో అశోక్ అనే వ్యక్తికి చెందిన ఫోన్ కాంటాక్ట్ నంబర్లు అన్నింటిని రుణం ఇచ్చిన కంపెనీ సేకరించింది. లోన్ తీసుకున్న అశోక్ దాని వడ్డీని కట్టలేదు. అసలూ కట్టడం లేదు. వాళ్లు పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేదు. వారికి దొరక్కుండా తిరుగుతున్నాడు అశోక్ కుమార్. లోన్ రికవరీ వీలుకాకపోవడంతో చెన్నైలోని కాల్ మన్ సర్వీసెస్ రికవరీ ఏజెన్సీకి అప్పగించారు. ఈ ఏజెన్సీకి చెందిన మేనేజర్లు మాధురి వాసు, మామిడిపూడి గురు ప్రసాద్ రెడ్డి, శివ వాసన్ మహేంద్రన్.. అతడి కాంటాక్ట్ నంబర్లను ముందే సేకరించిన కంపెనీ నిర్వాహకులు వారి నంబర్లకు ఫోన్ చేయడం ప్రారంభించారు. వారికి ఫోన్ చేసి అశోక్ లోన్ తీసుకున్నాడని, తిరిగి కట్టడం లేదని తీసుకున్న రుణం కట్టకపోతే మీ పరువూ తీస్తామని ఫోన్ లో బెదిరింపులకు పాల్పడ్డారు. అశోక్ కుమార్ ఫోన్ లో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫోన్ నంబరు ఉండటంతో ఆయనకు కాల్ చేసి వేధించారు.