Nellore News : నెల్లూరు జిల్లాలో ఆదివారం వస్తుందంటే ఎక్కడ ఎలాంటి ఘోరం జరుగుతుందోనన్న అనుమానం వెంటాడుతోంది. గతంలో కూడా ఆదివారం రోజునే పెన్నా నదిలో పలు ఘోరాలు జరిగాయి. తాజాగా మరోసారి ఆరుగురు యువకులు పెన్నాలో గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతయిన వారు సంగం మండలం జంగాలదరువు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. గల్లంతైన వారంతా ఇంటర్ విద్యార్థులుగా తెలుస్తోంది. ఆదివారం సరదాగా ఈతకు వచ్చిన వీరంతా పెన్నాలోని సుడిగుండాల్లో చిక్కుకున్నారు. ముగ్గురు మాత్రం స్నేహితుల సహకారంతో క్షేమంగా బయటపడ్డారు. మిగతావారు గల్లంతయ్యారు. 


గాలింపు చర్యలు 


నెల్లూరు జిల్లా పెన్నా నదిలో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతు అయ్యారు. గల్లంతైన యువకులు సంగం మండలం పెరమన జంగాలదరువుకు చెందిన డి. భవానీ, శ్యామ్‌ప్రసాద్‌, చరణ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తమ కుమారుల గల్లంతుపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.


గోదావరిలో గల్లంతు


తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో విషాదం చోటుచేసుకుంది. కొవ్వూరు మండలం మద్దూరు లంక సమీపంలో ఇటీవల గోదావరిలో మునిగి అక్కచెల్లెళ్లు మృతి చెందారు. మృతులు నిడదవోలు మండలం పురుషోత్తపల్లి గ్రామానికి చెందిన కోసన లక్ష్మీ ప్రసన్న, సాయి రాజేశ్వరిగా గుర్తించారు. గోదావరి విహారానికి వచ్చి ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. వారిని స్థానికులు రక్షించి రాజమండ్రి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. 


అసలేం జరిగింది?  


ఆదివారం కావడంతో నిడదవోలు మండలం పురుషోత్తమపల్లికి చెందిన కోసన లక్ష్మీ ప్రసన్న, సాయి రాజేశ్వరి విహారానికి గోదావరి దగ్గరకు వచ్చారు. కొవ్వూరు మండలం మద్దూరు లంక సమీపంలో గోదావరి వద్ద ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు వారిని బయటకు తీసి రాజమండ్రిలోని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అక్కచెల్లెళ్లు మరణించారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 


Also Read : Nizamabad News : మంచినీళ్లు అనుకుని కస్టమర్ కు యాసిడ్ ఇచ్చిన షాపింగ్ మాల్ వర్కర్, ఆ తర్వాత తాను తాగి!