ఉగ్రవాదుల్ని పట్టుకుని బంధించిన గ్రామస్థులు 


జమ్ము కశ్మీర్‌లో ఈ మధ్య కాలంలో మళ్లీ ఉగ్ర కదలికలు మొదలయ్యాయి. మిలిటెంట్లు, భారత సైనికుల మధ్య తరచుగా ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో ఉగ్రవాదుల్ని మట్టుబెడుతున్నారు. అటు సైనికులే కాదు. ప్రజలూ ఉగ్రవాదులపై కన్నేసి ఉంచుతున్నారు. అవసరమైతే ప్రాణాలకు తెగించి పట్టుకునేందుకూ వెనకాడటం లేదు. రెయిసీ జిల్లాలో జరిగిన ఓ ఘటన ఇదే విషయాన్ని రుజువు చేసింది. 
టక్సన్ గ్రామస్థులు ఇద్దలు లష్కరే తోయిబా ఉగ్రవాదుల్ని పట్టుకుని బంధించారు. వారు తప్పించుకుపోకుండా కాపాడుకుని చివరకు పోలీసులకు అప్పగించారు. ఈ ఇద్దరిలో ఒకరైన తాలిబ్ హుస్సేన్..లష్కరే సంస్థకు చెందిన సీనియర్ కమాండర్. రౌజారీ జిల్లాకు చెందిన హుస్సేన్, ఇటీవలే ఆ జిల్లాలో జరిగిన ఓ పేలుడు కేసులో ప్రధాన నిందితుడు. ఇక రెండో ఉగ్రవాది పేరు ఫైజల్ అహ్మద్ దార్. పుల్వామాకు చెందిన అహ్మద్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల లిస్ట్‌లో ఉన్నాడు. వీరిద్దరినీ పట్టుకున్న గ్రామస్థులు రైఫిల్స్, గ్రనేడ్స్ స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. 


రూ.2 లక్షలు బహుమతిగా ఇచ్చిన అదనపు డీజీపీ


ఇంత సాహసం చేస్తే పోలీసులు అభినందించకుండా ఉంటారా..? అభినందనలంటే ఏదో మాటగా కాదు. డబ్బు రూపంలోనూ అందింది. రూ.2 లక్షలను బహుమతిగా అందించారు అడిషనల్ డీజీపీ. ఆయనే కాదు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కూడా వీరికి రూ.5లక్షలు అందజేసి అభినందించారు. ఇదే విషయాన్ని ఏడీజీపీ ట్వీట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఆ గ్రామస్థులను ఆకాశానికెత్తేస్తున్నారు.