Nizamabad News : నిజామాబాద్ నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నీళ్లు అనుకుని కస్టమర్ కు యాసిడ్ ఇచ్చాడు ఓ వ్యక్తి. నగరంలోని గాంధీ చౌక్ సుల్తాన్ షాపింగ్ మాల్ కు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మహమ్మద్ నగర్ చెందిన విజయ్ కూమార్ కుటుంబం వచ్చింది. దాహంగా ఉందని విజయ్ కుమార్ అక్కడ పనిచేసే వ్యక్తిని వాటర్ అడిగారు. మంచినీళ్లు అనుకుని యాసిడ్ బాటిల్ ఇచ్చాడు షాపింగ్ మాల్ వర్కర్. కస్టమర్ తో పాటు షాపింగ్ మాల్ వర్కర్ కూడా యాసిడ్ తాగినట్లు తెలుస్తోంది. ఇద్దరీని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ఈ నెల 29న పెళ్లిరోజు ఉండటంతో విజయ్ కుమార్ కుటుంబం షాపింగ్ కు వచ్చినట్లు తెలుస్తోంది. 


గతంలో ఇలాంటి ఘటన


విజయవాడ నగరంలోని ఏనికేపాడులో ఏప్రిల్ నెలలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యాపారి నిర్లక్ష్యం డిగ్రీ విద్యార్థి పరిస్థితి ప్రాణాల మీదకి తెచ్చింది.  దాహంగా ఉందని వాటర్ బాటిల్ కోసం వెళ్లిన యువకుడికి దుకాణాదారుడు వాటర్ బాటిల్ బదులుగా యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. మంచినీళ్లు అనుకుని తాగడంతో విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 


అసలేం జరిగిందంటే.. 


చైతన్య అనే యువకుడు లయోలా కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అతడికి దాహంగా ఉందని షాప్ దగ్గరికి వెళ్లి వాటర్ బాటిల్ కొనుక్కున్నాడు. దాహంగా ఉండటంతో ఏమీ చూసుకోకుండా బాటిల్ ఉన్నది వేగంగా తాగేశాడు చైతన్య. ఆ తరువాత ఒక్కసారిగా చైతన్య కూర్చుండిపోయాడు. కడుపులో మంటగా ఉందని స్నేహితుడికి చెప్పాడు. ఏం జరిగిందని చెక్ చేయగా.. డిగ్రీ విద్యార్థి తాగింది నీళ్లు కాదు యాసిడ్ అని గుర్తించారు. 


విద్యార్థి చైతన్య వాటర్ బాటిల్ అడిగితే ఆ దుకాణదారుడు యాసిడ్ బాటిల్ నిర్లక్ష్యంతో యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. దాంతో యాసిడ్ కడుపులోకి వెళ్లడంతో ఒక్కసారిగా మండినట్లు అనిపించి చైతన్య కుప్పకూలిపోయాడని కుటుంబసభ్యులు, స్నేహితులు చెబుతున్నారు. యాసిడ్ కారణంగా అతడి అవయవాలు కొన్ని కాలిపోయినట్లు తెలుస్తోంది. చైతన్య కుప్పకూలగానే స్నేహితుడు అతడ్ని స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, చైతన్య వైద్యానికి కావాల్సిన బిల్లు నగదు కోసం కళాశాల యాజమాన్యం విరాళాలు సేకరించింది. దాతలు సహకరించాలని చైతన్య కుటుంబసభ్యులు కోరుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చిన దుకాణాదారుడిపై చర్యలు తీసుకోవాలని ఫ్యామిలీ, బంధువులు, స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు.