Nellore Accident : రోజూలాగే ఆ పిల్లలంతా స్కూల్ కి వెళ్తున్నారు. స్కూల్ బస్సులో సరదాగా ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుంటూ పిల్లలంతా వెళ్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా బస్సు బోల్తా కొట్టింది. రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. పిల్లలకు దెబ్బలు తగిలాయి. పిల్లలంతా హాహాకారాలు చేస్తుండటంతో వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన చూసిన వాహనదారులు పోలీసులకు సమాచారమిచ్చారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం మండలం మినగల్లు గ్రామస్తులంతా   పిల్లల కోసం పరుగులు పెట్టారు. దెబ్బలు తగిలినవారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 


అసలేం జరిగింది? 


బుచ్చిరెడ్డిపాలెం, మినగల్లు రహదారి గతేడాది వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నది. ఆ తర్వాత మరమ్మతులు జరిగినా.. రోడ్డు వెడల్పు లేకపోవడంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు స్పీడ్ గా వస్తే మాత్రం ఇబ్బంది. తాజాగా బస్సు ప్రమాదం జరిగిన చోట కూడా రెండు వైపులా పొలాలు ఉండి రోడ్డు ఇరుకుగా ఉంటుంది. స్కూల్ బస్ స్పీడ్ గా రావడంతో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించడం కష్టంగా మారినట్టు తెలుస్తోంది. దీంతో డ్రైవర్ బ్ససుపై నియంత్రణ కోల్పోయాడు. స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది, పల్టీ కొట్టింది. విద్యార్థులు గాయాలపాలయ్యారు. 




డ్రైవర్ పరారీ 


ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20మంది విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో నలుగురికి పెద్ద దెబ్బలే తగిలాయి. మిగతావారంతా చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారు. పుస్తకాల బ్యాగ్ లు చెల్లాచెదరుగా పడ్డాయి, క్యారేజీలు విడిపోయి ఆహార పదార్థాలు కూడా బస్సులో చిందరవందరగా పడ్డాయి. పిల్లలకు ప్రమాదం జరిగి ఉంటుందనే భయంతో వెంటనే డ్రైవర్ అక్కడినుంచి పారిపోయాడు. పిల్లలకు ప్రాణాపాయం ఉంటే తనను అరెస్ట్ చేయడం ఖాయమని అనుకున్న డ్రైవర్ వెంటనే పారిపోయాడని అంటున్నారు పోలీసులు. అయితే పిల్లలెవరూ పెద్దగా గాయపడలేదు. చిన్న చిన్న దెబ్బలతో అందరూ బయటపడ్డారు. అయితే ఒక్కసారిగా స్కూల్ బస్సు ప్రమాదానికి గురవడంతో పిల్లలంతా షాక్ లోకి వెళ్లారని తెలుస్తోంది. గాయపడ్డ వారిని వెంటనే ఆటోలో ఆస్పత్రికి తరలించారు. 


బాధ్యులపై కఠిన చర్యలకు డిమాండ్  


విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది. మరోవైపు ఈ వార్త తెలుసుకున్న తల్లదండ్రులు కూడా వెంటనే స్కూల్ బస్సు వద్దకు వచ్చారు తమ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లారు. గాయాలతో ఉన్నవారిని మాత్రం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు. స్కూల్ బస్సు ఫిట్ నెస్ పరిశీలించాలని కోరారు. విధి నిర్వహణలో అలసత్వంగా వ్యవహరించే డ్రైవర్లను విధుల్లోనుంచి తొలగించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 


Also Read : AP News : గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి రూ. 3 వేల కోట్లు - ఏపీ సర్కార్ కీలక నిర్ణయం !


Also Read : Railway New Coaches : భారతీయ రైల్వేకు కొత్త బోగీలు, సౌకర్యాలతో పాటు స్పీడ్ పెరిగిందోచ్!