Signature Forgery: నంద్యాల జిల్లాలో భూబకాసురుల ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. తాజాగా జిల్లా కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేసి భూమిని కాజేసేందుకు పన్నాగం పన్నారు. మహానంది మండలం యు.బొల్లవరం గ్రామంలోని సర్వే నంబర్ -486 లో వక్ఫ్ బోర్డుకు సంబంధించి 2.86 ఎకరాల భూమి ఉంది. దాదాపు రూ. 80 లక్షల వరకు విలువ ఉండే ఈ స్థలాన్ని కాజేసేందుకు ప్రయత్నించారు. సదరు భూమిని వక్ఫ్ బోర్డు పరిధి నుండి తొలగించినట్లు పత్రాలు తయారు చేసి వాటిపై జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ ఫోర్జరీ సంతకంతో ఉత్తర్వులు తయారు చేశారు. ఆ భూమిని అందులో పట్టా భూమిగా చూపించారు. అయితే ఫోర్జరీ సంతకాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తన సంతకం ఫోర్జరీ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్. సంబంధిత వ్యక్తులపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మహానంది తహశీల్దారు జనార్ధన్ శెట్టి ఆదివారం ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ వ్యవహారంలో సూత్రధారులు ఎవరనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. 


'వక్ఫ్ బోర్డు భూమిని ప్రొహిబిటరీ ప్రాపర్టీస్ నుండి కలెక్టర్ తొలగించినట్లు ఫోర్జరీ ఉత్తర్వులు వచ్చాయి. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. కలెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయమని ఆదేశించారు. ఫోర్జరీ ఉత్తర్వుల కాపీతో పోలీసులు ఫిర్యాదు చేశాం. ఈ కేసుపై రెవెన్యూ, పోలీసుల విచారణ సాగుతోంది. దర్యాప్తు అనంతరం నిందితులు ఎవరో తెలుస్తుంది' అని మహానంది తహశీల్దార్ జనార్ధన్ శెట్టి తెలిపారు.


'వక్ఫ్ బోర్డు భూమిని కన్వర్షన్ చేయమని ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించి సంబంధిత ఉత్తర్వులతో ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఉత్తర్వులు తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నాం. త్వరలోనే ఫోర్జరీ ఉత్తర్వులు తయారు చేసిన సూత్రధారులను, పాత్రధారులను పట్టుకుంటాం' అని మహానంది ఎస్సై నాగేంద్ర ప్రసాద్ తెలిపారు.


తిరుపతిలో అర్ధరాత్రి పూట అగ్గిరాజేస్తున్న యువతి


తిరుపతి జిల్లాలోని కొత్త శానంబట్లలో ఉన్నట్లుండి గడ్డివాములకు నిప్పంటుకోవడం, ఇళ్లలో బట్టలు తగలబడిపోవడం, ఒకానొక సమయంలో తాళం వేసిన ఇంట్లలోని బీరువాలకు మంటలు అంటుకోవడం సంచలనంగా మరింది. విరూపాక్ష సినిమా రిలీజ్‌ కావడం అలాంటి సీన్లే ఇక్కడ కనిపించడంతో అంతా కంగారు పడ్డారు. ఊరికేదో అరిష్టం జరిగిందని భయపడిపోయారు. వరుసగా జరుగుతున్న ఘటనలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. అసలు కొత్త శానంబట్లలో ఏం జరుగుతుందోనని స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందం చేసిన దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలను ఏఎస్పీ వెంకట రావు తెలిపారు.


ఈ ఘటనలకు కొత్త శానంబట్ల గ్రామానికి చెందిన ఓ 19 ఏళ్ల అమ్మాయే కారణమని షాక్ ఇచ్చారు. పిల్లపాలెం కీర్తిగా గుర్తించినట్లు వెల్లడించారు. తల్లి ప్రవర్తన నచ్చకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అని చెప్పారు. తల్లి ప్రవర్తనను మార్చేందుకు ఇలాంటి పనులు చేసిందని.. వారి బంధువుల ఇళ్లలో అగ్గి పుల్లలు గీసి పడేస్తూ.. ఘటనలకు పాల్పడినట్లు తెలిపారు. ముందుగా గడ్డివాము కాల్చి వేసిందని.. ఈ అగ్ని ప్రమాదాల్లో ఎలాంటి రసాయనాన్ని వినియోగింలేదని తెలిపారు. ఇందులో ఎలాంటి తాంత్రిక శక్తిని వినియోగించలేదని స్పష్టం చేశారు. మూఢనమ్మకాలను నమ్మకండని ప్రజలకు సూచించారు. తన ఇంట్లోనే యువతి మూడు సార్లు నిప్పు పెట్టిందని చెప్పారు.