మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. సీఎం జగన్ సమక్షంలోనే ఆయన ఈ కామెంట్స్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. 


బందరు పోర్టు పనులకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో మాట్లాడిన పేర్ని నాని తన రాజకీయ జీవితంపై కామెంట్స్ చేశారు. నాని మాట్లాడుతున్న టైంలో సమయం మించిపోతుందని వెనుక ఉన్న లీడర్ చెప్పారు. దీంతో ఆయన నువ్వు ఎంత గిల్లినా నేను తగ్గబోనని... మాట్లాడి తీరుతానని అన్నారు. అందుకే రిటైర్ అవుతున్నానంటూ ప్రకటించేశారు. 


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బందరుకు  పూర్వ వైభవం తీసుకొస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. బందరు పోర్టు నిర్మాణపనులను ప్రారంభించేందుకు సీఎం జగన్‌ మచిలీపట్నం వచ్చిన క్రమంలో భారత్‌ స్కౌట్స్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగం సభలో పేర్ని నాని ప్రసంగించారు. 


జగన్ చెప్పారంటే చేస్తారని ఇది ప్రజలందరికీ తెలుసు అన్నారు పేర్ని నాని. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు జగన్ పోర్టు పనులకు శంకుస్థాపన చేశారన్నారు. ఈ పనులు జరగకుండా చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని ఎదుర్కొని నిలబడి పనులు ప్రారంభించారన్నారు. బందరులో 25,090 మందికి ఇళ్లపట్టాలు ఇచ్చారన్నారు. మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన ఘతన కూడా ఆయనదే అన్నారు. గోల్డ్‌ కవరింగ్ యూనిట్‌ను నిలబెట్టిన వ్యక్తి కూడా జగనే అన్నారు. 


ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న జగన్‌ తనకంటే వయసులో చిన్న వాడని లేకుంటే ఆయనకు పాదాభివందనం చేసేవాడనని అన్నారు పేర్ని నాని. భవిష్యత్‌లో తనకు జగన్‌తో కలిసి సమావేసంలో పాల్గొనే ఛాన్స్ ఉంటుందో లేదో అని కూడా కామెంట్ చేశారు.