అమరావతిలో ఈ నెల 26న పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టబోతున్నట్టు సీఎం జగన్ తెలిపారు. సెంటు భూమిని ఉచితంగా పేదలకు ఇవ్వడమే కాకుండా అక్కడ ఇళ్లు కట్టించబోతున్నట్టు తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు ఆయన గ్యాంగ్ అడ్డుకుంటుందన్నారు సీఎం జగన్. 


 బందరు పోర్టుకు సీఎం జగన్ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఏళ్ల నాటి కల ఎట్టకేలకు సాకారమైందన్నారు. సోమవారం ఉదయమే తపసిపూడి తీరంలో బ్రేక్ వాటర్ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి పైలాన్‌ ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పరిషత్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ బందరు పోర్టు గురించి వివరించారు. అదే టైంలో ప్రతిపక్షాలపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. 


గతంలో చరిత్రలోఎప్పుడూ చూడని విధంగా ఈ ప్రభుత్వంలో అడుగులు ముందుకు పడుతున్నాయన్నారు సీఎం జగన్. ప్రపంచస్థాయి ప్రమాణాలతో 10 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మిస్తున్నాని 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు పనులు కూడా శరవేంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. పేదల సంక్షేమానికి కట్టుబడి అన్ని కార్యక్రమాలు చేస్తున్నామన్నారు సీఎం. పేదరికాన్ని సమూలంగా తీసివేయాలని అక్షరాల రూ.2.10లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు అందించినట్టు వివరించారు. నాన్‌ డీబీటీ ద్వారా మరో రూ.3 లక్షల కోట్లు ప్రజల చేతుల్లో పెట్టామని తెలిపారు. 


అమరావతి ప్రాంతంలో కూడా 50వేల మందికి నిరుపేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం రెండున్నర సంవత్సరాల క్రితం ప్రారంభించామన్నారు. కాని ఆ యజ్ఞానానికి రాక్షసులు అడ్డు పడ్డారని ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. టీడీపీకి తోడు గజదొంగల ముఠా అడ్డుపడుతోందన్నారు. దోచుకోవడం పంచుకోవడం వీరి పని అని అన్నారు. అమరావతిలో ప్రభుత్వ డబ్బుతో గేటెట్‌ కమ్యూనిటీ కట్టుకోవాలనుకున్నారన్నారు. బినామీల పేరుతో భూములుగడించి లక్షల కోట్లు దోచుకోవాలని ప్రయత్నించారని ఆరోపించారు. ఇందులో పేదల వర్గాలు కేవలం పాచి పనులు మాత్రమే చేయాలని తలచారని మండిపడ్డారు. రోజువారీ పనులు చేసే కార్మికులుగానే ఉండాలని... అమరావతిలో వీళ్ల పొద్దున్నే వెళ్లి సాయంత్రానికి తిరిగి వెళ్లిపోవాలని భావించారని ధ్వజమెత్తారు. ఇంతకంటే సామాజిక అన్యాయం ఎక్కడైనా జరుగుతుందా అని ప్రస్నించారు. ఇలాంటి మనస్తత్వం ఉన్న రాక్షసులతో యుద్ధంచేస్తున్నామన్నారు. 


పేదల జీవితాలు మారే విధంగా అండగా నిలబడాలన్నారు సీఎం జగన్. ఈ నెల 26న అమరావతిలో ఇళ్ల పట్టాలు పంపిణీ స్వయంగా చేస్తున్నట్టు వివరించారు. పేదలంటే చంద్రబాబుకు చులకన అని అన్నారు. ఎస్సీలు కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని బాబు అన్న మాట గుర్తు చేశారు. బీసీల తోకలు కత్తిరించాలని అన్న సంగతిని వివరించారు. మూడు రాజధానులు వద్దు అంటూ అన్ని ప్రాంతాల అభివృద్ధినే అడ్డుకున్నారని మండిపడ్డారు. మూడు ప్రాంతాల మీదే దాడి చేశారన్నారు. 


ప్రభుత్వం ఇస్తున్న ఇంటి స్థలాన్ని చంద్రబాబు శ్మశానంతో పోల్చడంపై జగన్ మండిపడ్డారు. పవిత్రమైన ఇంటి స్థలాన్ని శ్మశానంతో పోల్చడమేంటని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడూ మంచి చేయని వారు కూడా దీనిపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు పేదల కష్టాలంటే తెలియదన్నారు. సొంత ఇళ్లు లేకుంటే అద్దె ఇంట్లో పేదలు పడుతున్న సమస్యలు ఆయనకు కనిపించవన్నారు. అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఆసుపత్రిలో ఎవరైనా చనిపోతే ఆ డెడ్‌ బాడీని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలయని దుస్థితి ఇళ్లులేని పేదలది అన్నారు జగన్. అలాంటి వారి కష్టాలను చూసే సెంటు స్థలం ఇచ్చి ఇళ్లు కట్టించాలని ప్రభుత్వం నిర్మయించిందన్నారు. అలాంటి యజ్ఞాన్ని రాక్షసుల మాదిరిగా టీడీపీ, దానికి సపోర్ట్ చేసే మీడియా అడ్డుకుంటుందని విమర్శించారు. 


పేదలను ఆదుకోవాలనే ఆలోచన ఎప్పుడూ చంద్రబాబు రాలేదన్నారు జగన్. అందుకే ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మంచి చేసిన చరిత్ర వీళ్లెవరికీ లేదని అందుకే పలానా మంచి చేశామని చెప్పుకోలేరన్నారు. చేసిన మంచిని చెప్పుకొని ఓట్లు అడిగే పరిస్థితి కూడా లేదన్నారు. అందుకే వీళ్లంతా ఒక్కటై ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. 


మంచి చేసిన చరిత్ర ఉన్న జగన్‌ ఓడిపోతాడని ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. తాను మీడియాను నమ్ముకోలేదని... ప్రజలను, దేవుడిని మాత్రమే నమ్మకున్నానని అన్నారు. తన హయాంలో మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మద్దతుగా సైన్యంగా నిలబడాలని జగన్ పిలుపునిచ్చారు.