Bhanurekha Death Case: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఊహించని రీతిలో వరద ప్రమాదంలో విజయవాడకు చెందిన ఓ మహిళా టెకీ మృతి చెందింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం తేలప్రోలుకు చెందిన 22 ఏళ్ల భానురేఖ రెడ్డిఎలక్ట్రానిక్ సిటీలోని ఇన్ఫోసిస్ క్యాంపస్ లో పని చేస్తోంది.  అయితే ఆమె కుటుంబంతో కలిసి సరదాగా బయటకు వెళ్లాలనుకుంది. ఈక్రమంలోనే క్యాబ్ బుక్ చేసుకుంది. భానురేఖతో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులు కారులో బయలు దేరారు. అయితే కేఆర్ సర్కిల్ అండర్ పాస్ వద్ద భారీగా వరద నీరు చేరింది. అప్పటికే పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో వరదలు వచ్చాయి. ఆ సమయంలో అవతలి ఎండ్ లో ఎదురుగా కొన్ని వాహనాలు నిలిచి ఉంచడం గమనించిన క్యాబ్ డ్రైవర్.. వెళ్లిపోవచ్చనే ఉద్దేశంతో కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. కానీ అండర్ పాస్ మధ్యలోకి వెళ్లగానే ఒక్కసారిగా కారు మునిగిపోయింది. దీంతో క్యాబ్ లోని భానురేఖ కుటుంబ సభ్యులు కేకలు వేస్తూ.. సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. స్థానికులు కూడా చీరలు, తాళ్లు విసిరి వారిని కాపాడబోయారు. కానీ వరద నీరు మరింత పెరగడంతో వారిని కాపాడేందుకు సాధ్య పడలేదు. ఈలోపు అక్కడే ఉన్న సహాయక సిబ్బంది ఈదుకుంటూ వెళ్లి క్యాబ్ లోని ఇద్దరిని రక్షించారు. ఆపై నిచ్చెన ద్వారా అందరినీ బయటకు లాగారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకునే లోపే భానురేఖ మృతి చెందింది. 






చికిత్స చేసేందుకు వైద్యులు నిరాకరించారా..!



విషయం తెలుసుకున్న కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య ఆస్పత్రిని సందర్శించారు. ఈక్రమంలోనే భానురేఖ కుటుంబానికి రూ.5 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. అయితే భానురేఖను ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి ఆమె కొన ఊపిరితో ఉందని, ఆమెకు చికిత్స అందించేందుకు వైద్యులు నిరాకరించారని.. అందుకే తామే సాక్ష్యలం అని కొందరు చెబుతున్నారు. ఇది విన్న సీఎం సిద్ధ రామయ్య.. ఈ విషయంపై దర్యాప్తు చేయిస్తామని, అది రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే ఆస్పత్రి వర్గాలు మాత్రం భానురేఖ ఆస్పత్రికి చేరుకునేలోపే చనిపోయిందని అంటున్నాయి. ఆస్పత్రి సందర్శన తర్వాత సీఎం కార్యాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య.. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు.




ఆటోతో సహా చిక్కుకుపోగా.. టాప్ ఎక్కి ప్రాణాలు కాపాడుకున్న మహిళ



అదే కేఆర్ సర్కిల్ లోని అదే పాస్ వద్ద మరో మహిళా ప్యాసింజర్ ఆటోతో సహా చిక్కుకుపోగా.. పైకి ఎక్కి ఆమె తన ప్రాణాలను రక్షించుకుంది. రెస్క్యూ సిబ్బంది ఆమెను బయటకు తీసుకువచ్చారు. కేవలం గంట పాటు కురిసిన భారీ వర్షానికి.. ఇలా లోతట్టు ప్రాంతం మునిగిపోవడంతోనే ఈ విషాధం నెలకొంది. డ్రైవర్ల దూకుడు వల్లే ఇలాంటి ప్రమాదాలు ఏర్పడుతున్నాయని.. వరదల సమయంలో డ్రైవర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. వీలైనంత వరకు ప్రజలు కూడా వర్షం, వరదలు వస్తున్నప్పుడు బయటకు వెళ్లొద్దని వివరిస్తున్నారు.