Nalgonda Crime News: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ అమ్మాయి వెంట.. అదే వయసు ఉన్న యువకుడు పడుతున్నాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు మరోసారి తమ కూతురు వెంట పడొద్దని హెచ్చరించారు. ఆ తర్వాత కూడా అలాగే వేధిస్తుండడంతో షీటీంకు ఫిర్యాదు చేశారు. అయినా అతడవేమీ పట్టించుకోకుండా అమ్మాయి కోసం నేరుగా వాళ్ల ఇంటికే వచ్చేశాడు. అది చూసిన కుటుంబ సభ్యులు తీవ్ర కోపోద్రిక్తులయ్యారు. యువకుడిని ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక అతడు చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


అసలేం జరిగిందంటే?


నల్గొండ జిల్లాలో గురువారం రోజు దారుణం జరిగింది. గుర్రంపోడు మండలం కొప్పోలుకు చెందిన గాయత్రి అనే 18 ఏళ్ల యువతి నల్గొండలో ఇంటర్ చదువుతోంది. కట్టంగూరు మండలం దుగినెల్లి గ్రామానికి చెందిన 18 ఏళ్ల బొడ్డు సంతోష్ నకిరేకల్ లో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఆరు నెలల క్రితం నుంచి సంతోష్.. గాయత్రి వెంట పడుతుండగా యువతి తల్లిదండ్రులు షీటీంకు ఫిర్యాదు చేశారు. దీంతో షీటీమ్ పోలీసులు నల్గొండలో సంతోష్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పిటికీ అతను పట్టించుకోకుండా.. గురువారం రోజు ఇద్దరు స్నేహితులను తీసుకొని కొప్పోలు గ్రామానికి వచ్చాడు. యువతి కోసం ఇంటికి రాగానే.. బయట వీధిలో ఉన్న గాయత్రి నాయనమ్మ ఇది గమనించింది. వెంటనే బయట గడియపెట్టింది. దీంతో అతడితో వచ్చిన స్నేహితులు పారిపోయారు. వెంటనే వచ్చిన గాయత్రి తండ్రి యాదయ్య, కుటుంబ సభ్యులతో కలిసి సంతోష్ పై కర్రలతో దాడికి దిగాడు. ఇష్టం వచ్చినట్లుగా కొట్టడంతో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఎస్సై శివ ప్రసాద్ తన సిబ్బందితో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


Also Read: యువతిని వేధిస్తున్నాడని నడిరోడ్డుపై యువకుడి హత్య- లైవ్ లో మర్డర్ చూసిన జనానికి చెమటలు


ఇటీవలే మంచిర్యాల్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే..!


మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో జరిగిన హత్యను చూసిన ప్రజలు ఒక్కసారిగా భీతిల్లిపోయారు. ఊరంతా చూస్తుండగానే ఓ వ్యక్తిని కొందరు వ్యక్తులు అతి కిరాతకంగా దాడి చేసి చంపేశారు. ఇదంతా అక్కడి వాళ్లు షూట్ చేశారు. ముస్కె మహేష్ అనే వ్యక్తి బైక్ లో వెళ్తుండగా అటాక్ జరిగింది. పెట్రోల్ బంక్ పక్కనే అడ్డగించిన నలుగురు వ్యక్తులు దాడి చేశారు. ముందు దాడి చేశారు. తర్వాత గొంతు కోశారు. ఆ పై ఇంకా ప్రాణం ఉందని గ్రహించి పెద్ద బండరాయి తీసుకొచ్చి తలపై వేశారు. ఈ తంతంగాన్ని అక్కడి వారంతా తమ మొబైల్స్ షూట్ చేస్తున్నారే తప్ప మూకుమ్మడిగా వెళ్లి దాడిని అడ్డుకుందామన్న ఆలోచన ఎవరికీ రాలేదు. దాడిని చూస్తూ ఏదో సినిమాషూటింగ్ చూస్తున్నట్టు నిలబడిపోయారు. 


అసలు దాడి ఎందుకు జరిగిందని పరిశీలిస్తే.. ఇందారం గ్రామానికి చెందిన ఓ యువతితో మహేష్ కు మధ్య ప్రేమాయనం సాగుతోంది. ఈ ప్రేమ పెళ్లి పీటలు ఎక్కకుండానే ఫెయిల్ అయింది. ఇంతలో వేరే వ్యక్తికో ఆ యువతికి పెళ్లి కూడా జరిగిపోయింది. ప్రేమించిన యువతికి పెళ్లిపోయిందన్న విషయాన్నిజీర్ణించుకోలేక పోయిన మహేష్ తరచూ ఆమెకు ఫోన్ చేసేవాడు. మెసేజ్ లు పంపించేవాడు. దీన్ని గ్రహించిన యువతి బంధువులు మహేష్ కు వార్నింగ్ ఇచ్చారు. అయినా అతనిలో మార్పు రాలేదు. చివరకు విసిగిపోయి హత్య చేశారు. 


Also Read: ప్రేమించలేదని యువతి గొంతు కోయబోయాడు, కానీ అంతలోనే!