TSPSC Group-1: వచ్చే నెల జూన్ 11వ తేదీన జరగనున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్- టీఎస్పీఎస్సీ జూన్ 11వ తేదీన నిర్వహించ తలపెట్టిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను వాయిదా వేయాలని కోరుతు హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై ఇవాళ న్యాయస్థానం విచారణ చేపట్టింది. అయితే గురువారం ఉదయమే రిట్ పిటిషన్ జస్టిస్ కె. లక్ష్మణ్ తో కూడిన హైకోర్టు బెంచ్ ముందుకు వచ్చింది. కాగా, తన కుమార్తె కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల రాసినందున తాను పిటిషన్ ను విచారించలేనని జస్టిస్ కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. పిటిషన్ ను మధ్యాహ్నం మరో బెంచ్ కు పంపిస్తానని వివరించారు. లంచ్ తర్వాత జస్టిస్ పుల్లా కార్తీక్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ వెళ్లగా విచారణ జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. 


4 వారాలకు విచారణ వాయిదా


వివిధ పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసినప్పుడు సంబంధిత పరీక్షల మధ్య 2 నెలల వ్యవధి ఉండాలన్న నిబంధనను అమలు చేయకుండా గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ 36 మంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు.. దీనిపై వివరణ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, సిట్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. 


Also Read: RS Praveen Kumar: గ్రూప్-1 ఫస్ట్ ర్యాంకర్ ఎవరో చెబితే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్


పేపర్ల లీకేజీ కేసులో కొనసాగుతోన్న దర్యాప్తు.. 


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నియామక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు కొనసాగుతోంది. ఓవైపు నిందితులను ప్రశ్నిస్తూనే మరోవైపు క్షేత్రస్థాయిలో సిట్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. మొత్తం 5 బృందాలుగా ఏర్పడిన అధికారులు గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను ప్రశ్నించారు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థుల విద్యార్హతలు, గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కులు, ఎక్కడ శిక్షణ తీసుకున్నారు, కుటుంబ సభ్యుల వివరాలు, బంధువులు, స్నేహితుల వివరాలను సేకరించారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డితో అభ్యర్థులకు ఏమైనా స్నేహం, బంధుత్వం ఉందా అనే కోణంలోనూ ఆరా తీశారు. నగదు వ్యవహారం తేలడంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పేపర్ లీకేజీ కేసును విచారిస్తోంది.


'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష పేపర్లు వాట్సాప్ ద్వారానే చేతులు మారినట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో నిందితులు పకడ్బందీగా ప్రశ్నపత్రాలను పంచుకొని లాభపడే ప్రయత్నం చేశారని అధికారులు గుర్తించారు. దాంతో కేసు ఈడీ చేతికి వెళ్లింది. టీఎస్‌పీఎస్సీ కమిషన్ కార్యాలయం కేంద్రంగానే మొత్తం వ్యవహారం కొనసాగించినట్లు అంచనాకు వచ్చారు. ఈ కేసులో తాజాగా అరెస్టయిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, నలగొప్పుల సురేశ్, డేటా ఎంట్రీ ఆపరేటర్ దామెర రమేష్ కుమార్ రిమాండ్ రిపోర్టులో ఈమేరకు పలు అంశాలను అధికారులు ప్రస్తావించారు. పేపర్‌‌ లీకేజీలో ప్రధాన నిందితుడు రాజశేఖర్‌‌‌‌రెడ్డి.. న్యూజిలాండ్ లో ఉంటున్న అతడి బావ ప్రశాంత్‌‌ రెడ్డికి వాట్సాప్‌‌లో పేపర్లు పంపించినట్లు విచారణలో తేల్చింది. దీంతో అతడికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో వరుస అరెస్టులు కొనసాగుతున్నాయి. ప్రధాన నిందితులలో ఒకరైన రేణుకకు బెయిల్ రావడంతో ఇదివరకే జైలు నుంచి విడుదలైంది.