Muslim Man Beaten:


యూపీలో ఘటన..


యూపీలోని  బులందశర్‌లో ఓ ముస్లిం యువకుడిని ముగ్గురు దారుణంగా కొట్టారు. "జై శ్రీరాం" అని నినాదాలు చేయాలంటూ చితకబాదారు. అలా కొడుతూ వీడియో కూడా తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు ఆ వీడియోలోని ఇద్దరు నిందితులనీ అదుపులోకి తీసుకున్నారు. జూన్ 13న ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. జూన్ 17న వాళ్లను అరెస్ట్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులు వచ్చి ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకున్నారు. ఫిర్యాదులో ఉన్న వివరాల ప్రకారం..జూన్ 13వ తేదీన బాధితుడు సాహిల్ బస్‌స్టాండ్‌లో నిలబడి ఉన్నాడు. అప్పుడే ఓ ముగ్గురు యువకులు బైక్‌పైన వచ్చి బలవంతంగా సాహిల్‌ని కూర్చోబెట్టుకున్నారు. ఎవరూ లేని చోటకు తీసుకెళ్లారు. తమలో ఒకరి మొబైల్ పోయిందని, చోరీ చేసింది నువ్వేనా అని ప్రశ్నించారు. తనకేమీ తెలియదని బాధితుడు బదులిచ్చాడు. ఆ తరవాత ముగ్గురూ చెట్టుకి కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. గుండుకొట్టించారు. జై శ్రీరాం అని గట్టిగా నినాదాలు చేయాలని బలవంతం చేశారు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. అయితే...పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పైగా తనపై దొంగతనం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని ఆరోపించాడు బాధితుడు. అంతే కాదు. ఆ ముగ్గురిపై పెట్టిన కేసుని విత్‌డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. బాధిత కుటుంబ సభ్యులు ASPని ఆశ్రయించారు. ఆయనకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోని సాక్ష్యంగా చూపించారు. ఆ తరవాత విచారణ మొదలు పెట్టిన పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. 


"సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా నిందితులను గుర్తించాం. యువకుడిని దారుణంగా కొట్టారు. అదే గ్రామానికి చెందిన ముగ్గురు నిందితులు ఈ పని చేశారు. చోరీ చేశాడన్న అనుమానంతో ఇలా కర్కశంగా కొట్టారు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముగ్గురిలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నాం. తదుపరి విచారణ కొనసాగుతోంది"


- పోలీసులు


అయితే...ఇప్పటికీ నిందితుల కుటుంబ సభ్యులు తమని బెదిరిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. తాము పేదవాళ్లమని, అందుకే ఇలా పదేపదే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.