హైదరాబాద్‌లోని రాం నగర్‌ డివిజన్‌లోని ఎస్‌ఆర్కే నగర్‌లో కలకలం రేపిన తాగునీటి ట్యాంకులో కుళ్లిన శవం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నీళ్ల ట్యాంకులో కొద్ది రోజులుగా డీ కంపోజ్ అయిన శవం ఎవరిదో ఆచూకీ గుర్తించారు. మృతుడు చిక్కడపల్లి అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన కిశోర్‌ అని పోలీసులు తేల్చారు. ఘటనాస్థలంలో దొరికిన చెప్పుల ఆధారంగా మృత దేహం కిశోర్‌ అని ధ్రువీకరించారు. ఈ కిశోర్‌ అదృశ్యంపై 15 రోజుల క్రితం చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లోనే ఫిర్యాదు నమోదయింది. 


ఎలా గుర్తించారంటే..
తాగు నీటి ట్యాంకులో లభ్యమైన శవం గుర్తు పట్టలేకుండా ఉండడంతో పోలీసులకు ఇది సవాలుగా మారింది. ఆచూకీ గుర్తించేందుకు పోలీసులు ఇటీవల అదృశ్యమైన వ్యక్తుల కేసులపై ఆరా తీశారు. ఈ కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు.. చెప్పులు, దుస్తుల ఆధారంగా మృతదేహం కిశోర్‌దే అని నిర్ధరించారు. చనిపోయే ముందు అతను కుటుంబ సభ్యులతో గొడవ పడినట్లుగా తెలుస్తోంది. కాబట్టి, ప్రస్తుతం దీన్ని సూసైడ్‌గా పోలీసులు భావిస్తున్నారు.


డెడ్ బాడీ పూర్తిగా డీ కంపోజ్ అయి ఉందని, దాన్ని పట్టుకుంటే ఏ పార్ట్‌కు ఆ పార్ట్ ఉడిపోతోందని దాన్ని బయటకు తీసిన వ్యక్తి శ్రీను తెలిపారు. ముందుగా ట్యాంక్ నుంచి వాటర్ ఖాళీ చేసి లోపలికి దిగామని తెలిపారు. ట్యాంక్ లోపల మొత్తం దుర్వాసన వస్తోందని, ఓ సందర్భంలో ఆ దుర్వాసన వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతానేమోనని భయం వేసిందని అన్నాడు. డెడ్ బాడీని మూట గట్టి బయటకు తీసుకురావాల్సి వచ్చిందని అన్నారు.


ఏం జరిగిందంటే..
ఎస్ఆర్‌కే నగర్‌ ప్రాంతంలోని జల మండలికి చెందిన 50 అడుగుల ఎత్తున మంచి నీటి ట్యాంకులో ఒక మనిషి శవం ఉన్నట్లుగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సిబ్బంది ఎప్పటిలాగే ట్యాంకును శుభ్రం చేసేందుకు కూలీలను ట్యాంకుపైకి పంపించారు. కూలీలు ట్యాంకుపై ఉన్న మూతను తీసి లోపలికి దిగి లైట్లు వేసి చూడగా.. అందులో కుళ్లిపోయిన స్థితిలో ఓ వ్యక్తి శవం కనిపించింది. దీంతో వారు భయంతో కిందికి వచ్చి విషయాన్ని సిబ్బందికి చెప్పారు. వెంటనే జలమండలి సిబ్బంది ముషీరాబాద్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని జీహెచ్‌ఎంసీ అత్యవసర విభాగం డీఆర్‌ఎఫ్‌ సహాయంతో మృత దేహాన్ని బయటకు తీశారు.


ఆందోళనలో స్థానికులు
శవం ఉన్న ట్యాంకులోని నీళ్లను కొన్ని రోజులుగా ప్రజలకు సరఫరా చేస్తూనే ఉన్నారు. ఆ శవం సంగతి తెలియడంతో ఆ నీళ్లను తాగిన ప్రజలు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. ఆ శవం ఎన్ని రోజుల నుంచి ట్యాంకులో ఉందో అంటూ వారిలోవారు చర్చించుకుంటున్నారు. నీళ్ల ట్యాంకు నిర్వహణ చేస్తున్న బాధ్యులు తరచూ పర్యవేక్షించకుండా ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముషీరాబాద్ పరిధిలో కొన్ని వేల కుటుంబాలు కుళ్లిన శవం పడిన నీటినే మంచి నీరు తాగుతూ వచ్చారు. శివస్థాన్ పూర్, ఎస్ఆర్కె నగర్, పద్మశాలి సంఘం, హరినగర్ కాలనీలకు ఈ ట్యాంకర్ నుంచే డ్రింకింగ్ వాటర్ సప్లై జరుగుతుంది.


Also Read: కోట్లకు కోట్లు ఇచ్చిన వాళ్లు కిక్కురుమనడం లేదా ? శిల్పాచౌదరి కేసులో ఏం జరుగుతోంది ?


Also Read: వివాహేతర సంబంధం.. భర్తతో కలిసి ప్రియుడిని హతమార్చిన మహిళ.. ట్విస్ట్ ఏంటంటే..!


Also Read: Honour Killing: సొంత అక్క తల నరికిన తమ్ముడు.. అందుకు కన్నతల్లి సాయం, తల వేరు చేసి తల్లీకొడుకుల సెల్ఫీలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి