వరదలు తగ్గాయి, వర్షాలు లేవు, పంట వేయడానికి ఇదే అనువైన సమయం. అయితే నెల్లూరు జిల్లాలో రైతుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఇప్పటికే రెండు సార్లు పెట్టుబడి పెట్టి మోసపోయారు రైతులు. భారీ వర్షాలకు నారుమడుల దశలోనే పంట నీటిపాలైంది. మూడోసారి పెట్టుబడికి వారి వద్ద డబ్బులు లేవు, అటు ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు ఇస్తామంటున్నా.. అది ఇప్పుడల్లా సాధ్యం అయ్యేలా లేదు. అదను పోతే మళ్లీ ఆలస్యం అవుతుంది. దీంతో చాలామంది ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక ధరలకు విత్తనాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. 


నెల్లూరు జిల్లాలో 7675 ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. 1804 ఎకరాల్లో మినుము వేసిన రైతులు నష్టపోయారు. పొగాకు, వేరు శెనగ, పెసర.. ఇలా అందరికీ నష్టం జరిగింది. అయితే వరి విషయంలో నష్టాన్ని పూడ్చుకోడానికి కూడా కష్టమే. ఇప్పటికే రెండు సార్లు విత్తనంపై ఖర్చు పెట్టిన రైతులు మరో దఫా నారుమడులు సిద్ధం చేయాలంటే పెట్టుబడిలేక వెనకడుగు వేస్తున్నారు. 




వరి విత్తనాలకు కరవు.. 
నెల్లూరు జిల్లాలో అవసరమైన వరి విత్తనాలు అంటే ఒడ్లు 30 వేల క్వింటాళ్లు కాగా, ప్రస్తుతం కేవలం 9500 క్వింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో మరో 15 వేల క్వింటాళ్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం రాయితీ కింద విత్తనాలను అందిస్తే 30 కిలోల విత్తనాల బస్తా 198 రూపాయలకు రైతులకు చేరుతుంది. అదే ప్రైవేటు వ్యాపారి వద్ద కొనుగోలు చేయాలంటే మాత్రం 1200 రూపాయలు. అటు ప్రభుత్వం వద్ద విత్తనాలు సరిగా అందుబాటులోల లేక, ఇటు ప్రైవేటు వ్యాపారుల వద్ద కొనుగోలు చేయలేక రైతులు సతమతం అవుతున్నారు. 


ఈ నెల 8 తేదీ వరకు వివరాలు సేకరించి, పదో తేదీ నాటికి పూర్తిస్థాయి నష్టాన్ని నమోదు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు సిబ్బంది అంచనాలు సేకరించారు. సిబ్బంది ఈ సేకరణలో ఉండటంతో.. రైతు భరోసా కేంద్రాల ద్వారా వరి విత్తనాల పంపిణీలో జాప్యం జరుగుతోంది. అక్కడకు వెళ్లిన వారికి రేపు, మాపు అంటూ సిబ్బంది చెప్పి పంపిస్తున్నారు. 


వర్షాలు, వరదలకు దెబ్బతిన్న వరి నారుమడుల స్థానంలో తిరిగి సాగుకు అవసరమైన వరి విత్తనాలు పుష్కలంగా ఉన్నాయని ఇదివరలో కలెక్టర్ చక్రధర్ బాబు ప్రకటించారు.  80 శాతం రాయితీపై రైతులకు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కానీ క్షేత్ర స్థాయిలో రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటుగా అధిక ధరకు కొనుగోలుచేయాల్సి వస్తోంది. దీంతో పేద రైతులకు ఇది భారంగా మారింది.


అదనులో సాగు చేస్తేనే పంట దిగుబడులు బాగుంటాయి. లేకుంటే దిగుబడులు తగ్గుతాయి. చివరకు అప్పులు మిగులుతాయి. ప్రస్తుతం నెల్లూరు మసూరి రకం సాగుకు అనుకూలం. రాయితీతో వరి విత్తనాలు లభించకపోవడంతో ప్రైవేటు దుకాణాల్లో అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు రైతులు. అధికారులు మాత్రం ఈరోజునుంచి విత్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. 


Also Read: Nellore RedCross : రూ. 500కే ఐసీయూ ఆన్ వీల్స్.. నెల్లూరు వాసులకు రెడ్‌క్రాస్ సేవ !


Also Read : 2024 తరవాత పొలిటికల్ రిటైర్మెంట్ .. సోము వీర్రాజు నిర్ణయం !


Also Read : అమరావతి రైతుల భోజన ఏర్పాట్లు చేస్తున్న పొలం దున్నేసిన దండగులు ! వైఎస్‌ఆర్‌సీపీ నేతల పనేనని ఆరోపణలు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి