Mumbai Court Dismisses Tanushree Dutta Meetoo Case Against Bollywood Actor Nana Patekar: బాలీవుడ్ నటుడు నానా పాటేకర్‌కు (Nana Patekar) బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనపై హీరోయిన తనుశ్రీ దత్తా (Tanushree Dutta) వేసిన లైంగిక వేధింపుల కేసును ముంబై కోర్టు కొట్టేసింది. దీనిపై నిర్ణీత టైంలో కంప్లైంట్ చేయలేదని.. తగిన ఆధారాలు సమర్పించలేదని కోర్టు పేర్కొంది. అందువల్ల ఇది విచారణకు అర్హత కాదని పేర్కొన్న న్యాయస్థానం.. చట్ట ప్రకారం మూడేళ్ల లోపు ఫిర్యాదు చేస్తేనే విచారణకు అర్హత ఉందని.. పదేళ్ల నాటి ఘటనను విచారించడం కుదరదని న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. కాగా.. 2018లో #Metoo ఉద్యమంలో నటి తనుశ్రీ దత్తా ప్రముఖ పాత్ర పోషించారు.
నానా పాటేకర్‌పై ఆరోపణలు చేసిన నటి
2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా కోసం ఓ పాట చిత్రీకరణ సమయంలో నానా పాటేకర్ సహా అతనితో పాటు ఉన్న మరో ముగ్గురు తనను వేధించారని తనూశ్రీ దత్తా ఆరోపించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆమె బహిరంగంగానే ఈ ఆరోపణలు చేయడంతో పలువురు హీరోయిన్లు తమకు జరిగిన చేదు అనుభవాలపై ఆరోపణలు చేశారు. తనూశ్రీ ఆరోపణలపై 2018లో పోలీసులు కేసు నమోదు చేయగా.. విచారణలో అలాంటిదేమీ జరగలేదని తేల్చారు. ఆమె ఆరోపణలన్నీ అవాస్తవాలని పోలీసులు కోర్టుకు నివేదిక ఇచ్చారు. దీనిపై తనూశ్రీ 2019లో మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, సరైన ఆధారాలు లేని కారణంగా.. నిర్ణీత కాల వ్యవధిలో ఫిర్యాదు రానందున ఆ కేసులు కొట్టేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
తనూశ్రీ దత్తా తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'వీరభద్ర' సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా అంతగా విజయం సాధించకపోవడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. అనంతరం హిందీలో '36 చైనా టౌన్', 'ధూల్', 'గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్' వంటి సినిమాల్లో నటించారు. 2018లో ఆమె చేసిన 'మీటూ' ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. తాజాగా.. కోర్టు సరైన ఆధారాలు లేవని ఆ కేసులను కొట్టేసింది.