SIT: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వరుసగా జరుగుతున్న సాక్షుల మరణాలపై ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పదహారు మందితో సిట్ ఏర్పాటు చేశారు. దీనికి సీనియర్ డీఎస్పీ నేతృత్వం వహిస్తారు. సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లను కూడా ఇందులో భాగంగా ఉంటారు. ఇప్పటి వరకూ వివేకా హత్య కేసులో అత్యంత కీలకమైన సాక్షులు ఆరుగురు చనిపోయారు. వైసీపీ హయాంలోనే నలుగురు చనిపోయారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఇద్దరు చనిపోయారు. అందరూ అనారోగ్య కారణాలతోనే అనుమానాస్పదంగా చనిపోతున్నారు. అందుకే ఇందులో ఉన్న మిస్టరీ ఏమిటో తేల్చాలని ప్రభుత్వ నిర్ణయించింది. కేబినెట్ భేటీలోనూ ఈ అంశంపై డీజీపీ నుంచి వివరాలు తీసుకున్నారు.
ఇప్పటి వరకూ ఆరుగురు సాక్షుల మృతి
2019 మార్చ్ 15 న జరిగిన వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ముందు గుండెపోటుగా భావించారు. తర్వాత హత్యగా తేలింది. అప్పట్నుంచి ఈ కేసులో సాక్షులుగా ఉన్న వారిలో ఆరుగురు చనిపోయారు. శ్రీనివాస రెడ్డి అనే సాక్షి 2019 లో చనిపోయాడు. ఆత్మహత్య అని డిసైడ్ చేసిన పోలీసులు కేసు క్లోజ్ చేశారు. సిట్ పోలీసులు వేధించారని పోలీసులు రిపోర్టులో రాశారు. గంగాధర్ రెడ్డి అనే సాక్షి కూడా చనిపోయారు. రూ. 10 కోట్లు ఇస్తాం మర్డర్ కేసు నీ మీద వేసుకో అని శివశంకర్ రెడ్డి బెదిరిస్తున్నారు అని సీబీఐకి చెప్పాడు. తర్వాత సీబీఐ అధికారులు బెదిరించారని ఆరోపించాడు. ఇతను కూడా అనంతపురం జిల్లాలో అనుమానాస్పదంగా చనిపోయాడు. జగన్ మోహన్ రెడ్డి డ్రైవర్ నారాయణ కూడా చనిపోయారు. వివేకానందరెడ్డి చనిపోయారని తెలిసిన తర్వాత హైదరాబాద్ నుంచి కారులో జగన్ , భారతి వెళ్లారు. వారి కారు డ్రైవర్ నారాయణ. ఆయన కూడా అనుమానాస్పదంగా చనిపోయారు.
వివేకా మృతదేహానికి కుట్లు వేసిన ఈసీ గంగిరెడ్డి, అభిషేక్ రెడ్డి కూడా మృతి
ఇటీవల వైఎస్ డాక్టర్ అభిషేక్ రెడ్డి చనిపోయాడు. ఆయనది చిన్న వయసే. రాజకీయంగా మంచి భవిష్యత్ ఉంటుందనుకున్నారు. గత ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో ఓ మండలానికి ఇంచార్జ్ గా వ్యవహరించారు. తర్వాత అనారోగ్యం పాలై చాలా కాలం కోమాలో ఉండి చనిపోయారు. అలాగే డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కూడా చనిపోయారు. ఈ ఇద్దరూ వైద్యులు. వివేకా మృతదేహానికి గాయాలు కనిపించకుండా కుట్లు వేశారు.ఇక రెండు రోజుల కిందట వివేకా ఇంటి వాచ్ మెన్ రంగన్న చనిపోయారు.
విచారణ త్వరగా ముగించాలని కోరుతున్న వివేకా కుమార్తె
సాక్షులు చనిపోతున్నారని వివేకా హత్య కేసును త్వరగా విచారణ చేయాలని ఇప్పటికే వివేకా కుమార్తె కోర్టులో పిటిషన్లు వేశారు. శుక్రవారం మంత్రివర్గంలో కూడా దీనిపై చర్చ జరిగింది. సాక్షుల మరణాల విషయంలో ఏం జరిగిందో ఆరా తీస్తే.. వివేకా హత్య కేసులోని కీలక విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టించారని.. వారిని అడ్డుకున్నారని.. బెదిరించారని తేల్చారు. గతంలో కడపలో పని చేసిన పోలీసులు, ఇతర అధికారుల్ని కూడా విచారించి.. ఈ సీక్రెట్లేమిటో సిట్ బయట పెట్టనుంది.