Chhaava Telugu Movie First Day Collections: బాలీవుడ్ టాప్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటించిన లేటెస్ట్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'ఛావా' (Chhaava). ఫిబ్రవరి 14న హిందీలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించింది. ఈ క్రమంలో తెలుగులోనూ రిలీజ్ చేయాలనే డిమాండ్లు వినిపించగా గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ బ్యానర్‌పై ఈ నెల 7న తెలుగులో రిలీజ్ అయ్యింది. హిందీలో హిట్ కొట్టిన 'ఛావా'.. తెలుగులో ఫస్ట్ డే మంచి కలెక్షన్లు రాబట్టింది. సినిమాపై పాజిటివ్ టాక్ ముందు నుంచీ ఉండగా.. ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద రూ.3.03 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. వీకెండ్స్‌లో కలెక్షన్లు ఇంకా పెరగొచ్చని సినీ వర్గాల టాక్. హిందీలో విడుదలై మూడు వారాలైనా.. ఈ స్థాయిలో వసూళ్లు రావడం గ్రేట్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు, సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీ రీ రిలీజ్ ప్రభావం కూడా సినిమా కలెక్షన్లపై పడిందని అభిప్రాయపడుతున్నారు.
హిందీలో బ్లాక్ బస్టర్ రికార్డులు
ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా 'ఛావా' తెరకెక్కింది. శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక తమ నటనతో అదుర్స్ అనిపించారు. విక్కీ కౌశల్ యాక్షన్, యుద్ధ సన్నివేశాలు, బీజీఎం వేరే లెవల్. ఈ మూవీకి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించారు. దినేష్ విజయన్ నిర్మాతగా వ్యవహరించారు. సినిమాలో అక్షయ్ ఖన్నా, డయానా పెంటీ, అశుతేష్ రాణా, దివ్య దత్తా, వినీత్ కుమార్ సింగ్, సంతోష్ జువేకర్, కిరణ్ కర్మాకర్, అలోక్ నాథ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమా విడుదలైన చాలా రోజుల వరకూ థియేటర్‌లో ఆ హిస్టారికల్ మేనియా నడిచింది. మూవీ చూసి బయటకు వచ్చిన చాలామంది ఆడియన్స్ ఎమోషన్‌తో కన్నీళ్లు పెట్టుకున్నారు. చాలామంది ప్రేక్షకులు సినిమా క్లైమాక్స్‌లో నినాదాలు చేస్తూ జేజేలు పలికారు. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. కేవలం హిందీలోనే ఇన్ని వసూళ్లు రాబట్టగా.. ఇప్పుడు తెలుగు వెర్షన్‌లోనూ అంతే స్థాయిలో ఎంటర్‌టైన్ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: 'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - తాను అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి